'అ ఆ ఇ ఈ' లోగో
శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా హీరోహీరోయిన్లుగా శ్రీ కల్పన ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో బొద్దం అశోక్ యాదవ్ నిర్మిస్తున్నచిత్రం 'అ ఆ ఇ ఈ'. దీనికి 'అతను ఆమె ఇంతలో ఈమె' అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈనెల 20న ఆడియో, మే 1న సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. సోమవారం ఉదయం హైద్రాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో ఈ చిత్రం లోగో ఆవిష్కరణ జరిగింది. చిత్ర సంగీత దర్శకురాలు శ్రీలేఖ ఈ లోగోనే ఆవిష్కరించారు.
నిర్మాత అశోక్ యాదవ్ మాట్లాడుతూ 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'యమగోల మళ్లీ మొదలైంది' చిత్రాల కంటే మరింత పగడ్బందీగా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెరకెక్కించారని చెప్పారు. తన కెరీర్ లోనే ఇది ఉత్తమ చిత్రమవుతుందని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇదివరకు తాను చేసిన హాస్య చిత్రాలన్నీ బయ్యర్లకు అనుకూలమైనవేననీ, ఇప్పుడు ఒక మెట్టు ఎక్కి మంచి బలమైన కథాంశాన్ని తీసుకుని ఈ సినిమా చేశాననీ చెప్పారు. తన తరహా వినోదంతో పాటు ఇందులోని ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. తన కాంబినేషన్ లో సంగీత దర్శకురాలుగా శ్రీలేఖకు ఇది నాలుగో చిత్రమనీ, ఇందులో పాటలన్నీ భాస్కరభట్ల రాశాననీ చెప్పారు. నిర్మాత ఇచ్చిన సహకారంతో సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపారు. 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్' కంటే బాగా ఈ చిత్రం ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని శ్రీలేఖ తెలిపారు. టైటిల్స్ ఎంపికలో శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకత ఉందనీ, ఈ సినిమా టైటిల్ సైతం ఇప్పటికే మంచి పాపులారిటీ తెచ్చుకుందనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శేఖర్ చెప్పారు. ఈ సమావేశంలో ఎడిటర్ గౌతంరాజు, దర్శకుడు ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గిరిబాబు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఏవీయస్, సునీల్, ఎంఎస్ నారాయణ, కృష్ణ భఘవాన్, రఘుబాబు, రమ్యశ్రీ తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|