20 ప్రింట్లతో 'ఆకాశమంత'
తండ్రీకూతుళ్ల ఆప్యాయానుబంధాలకు అద్దంపట్టే సకుటుంబ కథా చిత్రం 'ఆకాశమంత'. కూతురుపై ఆ తండ్రికి ఉన్న ప్రేమ ఆకాశమంత అయితే, ఆ కూతురికి తండ్రి పంచప్రాణాలు. ఇరవై ఏళ్ల వారి అనుంబంధంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవడంతో వారి జీవితాలపై అవి ఎలాంటి ప్రభావం చూపించాయనేది ఈ చిత్ర ఇతివృత్తం. త్రిష, ప్రకాష్ రాజ్ తండ్రీకూతుళ్లుగా నటించారు. రాధా మోహన్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ సొంతంగా నిర్మించి ఇటీవల విడుదల చేశారు. అదే చిత్రం ఇప్పుడు కొద్దిపాటి రీషూటింగ్ తో, తక్కినదంతా రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని 20 ప్రింట్లతో విడుదల చేస్తున్నట్టు దిల్ రాజు తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై తమ సంస్థ నిర్మిస్తున్న 8వ చిత్రమిదనీ, మంచి అనుభూతిని కలిగించే కథ, ఆసక్తికిని రేకెత్తించే కథనం, చక్కటి చిత్రీకరణతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. చిన్నబడ్జెట్ చిత్రమే అయినా ఫీల్ గుడ్ మూవీ అవుతుందన్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టు తెలిపారు. విద్యాసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను ఈనెల 20న విడుదల చేసి, ఉగాది కానుకగా ఈనెల 27న సినిమాను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. శిరీష్, లక్ష్మణ్ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రీతా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|