బోయపాటి బ్యాడ్ లక్?
'భద్ర', 'తులసి' వంటి రెండు వరుస సక్సెస్ చిత్రాలకు దర్శకత్వం వహించినప్పటికీ బోయపాటి శ్రీను కెరీర్ ఎందుకో అనుకున్నంత సజావుగా ముందుకు సాగడం లేదు. తొలుత ముత్యాల సుబ్బయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా 9 సినిమాలకు పనిచేసి, 'అన్నయ్య' సినిమాకి అసోసియేట్ గా మారి దర్శకత్వంపై పూర్తి అవగాహనతో ఆయన పగ్గాలు చేపట్టారు. దర్శకుడిగా రెండు హిట్లు ఆయన ఖాతాలో ఉన్నప్పటికీ ఆయన తదుపరి చిత్రం కొద్దికాలంగా వార్తల్లోనే ఉంటూ వస్తోంది. అయితే అది కార్యరూపంలోకి మాత్రం రావడం లేదు. తాజాగా ఆయన మరో మంచి అవకాశాన్ని కూడా కోల్పోయారు. రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాత గణేష్ ఇటీవల ప్రకటించారు. 'భద్ర' తర్వాత రవితేజ-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిదని ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల్లో భాగంగా బోయపాటిని తప్పించి ఆ ప్లేస్ లో పరశురామ్ ('యువత' ఫేమ్) ను దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇందుకు కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.
బోయపాటి ఇటీవల కాలంలో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజార్చుకోవడం ఇది మూడోసారి. గోపీచంద్ హీరోగా జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రానికి తొలుత బోయపాటిని అనుకుని ఆ తర్వాత ఆయనను తప్పించారు. నాగార్జున, కామాక్షి మూవీస్ బ్యానర్ కాంబినేషన్ చిత్రానికి కూడా బోయపాటి పేరు పరిశీలనలోకి వచ్చింది. చివరకు అది కూడా కార్యరూపంలోకి రాలేదు. రవితేజ సినిమాకి బోయపాటి పేరును కొద్దిరోజుల క్రితమే నిర్మాత గణేష్ ప్రకటించారు. ఇప్పడు కూడా ఆయనకు ఉద్వాసన తప్పలేదు. ప్రతిభ ఉన్నా అదృష్టం చిన్నచూపు చూడటమంటే ఇదేనేమో?!
Be first to comment on this News / Article!
|