శంకర్ 'కళాశాల' ఆడియో
విద్యార్థుల జీవితాల్లో జరిగే సహజ సంఘటనలో రూపొందిన చిత్రం 'కళాశాల'. తమిళనాడులోని ధర్మపురి పట్టణంలో ఉన్న ఓ కళాశాలలో జరిగిన యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని తమిళంలో 'కళ్లూరి' పేరుతో ఈ చిత్రాన్ని తీశారు. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ సమర్పణలో జ్యోతి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత ఎం.వి.గోపాలరావు ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ప్రేక్షకులకు అందిస్తున్నారు. తమన్నా, అఖిల్ జంటగా నటించారు. ఈ చిత్రానికి శంకర్ శిష్యుడు బాలాజీ శక్తివేల్ ('ప్రేమిస్తే' ఫేమ్ ) దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో మంగళవారంనాడు జరిగింది. చిత్ర సమర్పకుడు శంకర్ స్వయంగా విచ్చేసి ఆడియో క్సాసెట్లు, సీడీలు ఆవిష్కరించి తొలి ప్రతులను బాలాజీ శక్తివేల్ కు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
శంకర్ మాట్లాడుతూ, గతంలో తాను నిర్మించిన 'ప్రేమిస్తే' చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ పెద్ద హిట్టయిందనీ, అలాగే తమిళంలో విజయం సాధించిన కల్లూరు ఇప్పుడు తెలుగులోనూ 'కళాశాల'గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనీ అన్నారు. బాలాజీ శక్తివేల్ ఈ చిత్రాన్ని ఎంతో చక్కగా మలిచారనీ, కళాశాల విద్యార్థుల మనోభావాలు, అక్కడ చోటుచేసుకునే సంఘటనలను దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించినట్టు చెప్పారు. తెలుగులో 'హ్యాపీడేస్' తరహాలోనే ఈచిత్రం తమిళంలో తనకెంతో మంచి గుర్తింపు తెచ్చిందనీ, తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాననీ తమన్నా పేర్కొంది. ఇందులోని పాత్రలన్నీ సహజత్వంతో ఉంటాయనీ, అతి త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాత ఎం.వి.గోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానం నాగ అశోక్ కుమార్, గీత రచయిత వనమాలి తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|