'వినాయకుడు-2' వస్తోంది
ప్రేక్షకులు మెచ్చిన సినిమాలకు సీక్వెల్ తీస్తే బాగుంటుందనే ఆలోచన ఫిల్మ్ మేకర్స్ లో ఉంటుంది. బాలీవుడ్ లో ఎప్పట్నించో ఈ సాంప్రదాయం ఉన్నా తెలుగులో సీక్వెల్ సంస్కృతి తక్కువే. ఆమధ్య 'శంకర్ దాదా ఎంబిబిఎస్'కు సీక్వెల్ గా 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ ఇప్పుడు 'ఆర్య-2' సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా 'బిగ్ ఫ్యాట్ లవ్ స్టోరీ' వంతు వచ్చింది. ఇదే ట్యాగ్ లైన్ తో గత ఏడాది విడుదలై విజయవంతమైన 'వినాయకుడు' చిత్రాన్ని ఆ చిత్ర దర్శకుడు సాయికిరణ్ అడవి సీక్వెల్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కృష్ణుడు, సోనియా ప్రధాన పాత్రల్లో సాయికిరణ్ అడవి తొలిసారిగా దర్శకత్వం వహించిన 'వినాయకుడు' చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో మళ్లీ ఇదే జంటతో ఆయన 'వినాయకుడు-2' చిత్రానికి స్క్రిప్టు సిద్ధం చేశారు. ఆసక్తికరంగా సాయికిరణ్ ఈసారి మూన్ వాటర్ పిక్చర్స్ అనే సొంత బ్యానర్ పై ఈ చిత్రానికి నిర్మాతగా కూడా మారుతున్నారు.
ఊబకాయంతో అవమానాలు ఎదుర్కొంటూ వచ్చిన ఓ యువకుడు నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలబడటమే వినాయకుడు ఇతివృత్తం. ప్రధాన జంట కృష్ణుడు, సోనియా లవ్ స్టోరీని సుఖాంతం చేసిన దర్శకుడు సాయికిరణ్ ఇప్పుడు వివాహానంతంరం వారి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని కథను నడుపుతారనీ, ఇందుకు గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకుంటారని తెలుస్తోంది. మరో కీలక పాత్రకు రావు రమేష్ (రావుగోపాలరావు తనయుడు)ను ఎంపిక చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తి చేసి గోదోవారి పరిసర ప్రాంతాల్లో జూన్ నుంచి సినిమాను ప్రారంభించనున్నారు.
Be first to comment on this News / Article!
|