సంగీత నాట్ జౌట్!
పెళ్లయిన హీరోయిన్లకు సహజంగానే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతుంటాయి. పలువురు హీరోయిన్లు సైతం డిమాండ్ లో ఉన్నప్పుడు నాలుగు డబ్బులు వెనకేసుకుని ఆనక పెళ్లితో సెటిలైపోతుంటారు. 'ఖడ్గం', 'శివపుత్రుడు' 'మా ఆయన చంటిపిల్లాడు' వంటి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సంగీత ఈమధ్యనే తమిళ గాయకుడు క్రిష్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఇక సంగీత సినిమాలకు స్వస్తి చెబుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో 'అలాంటిదేమీ లేదు' అంటూ కొత్త సినిమాలకు సంగీత మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా 'నాన్ అవన్ ఇళ్లై' అనే తమిళ చిత్రానికి సంగీత సైన్ చేశారు. ఇందులో సంసార పక్షంగా ఉండే గృహిణి పాత్రను ఆమె పోషిస్తోంది.
'మొదట్నించీ నటిగా అన్ని రకాల పాత్రలు చేయడానికే నేను ఇష్టపడుతుంటాను. పెళ్లికి ముందు కూడా చాలా సినిమాల్లో గృహిణి పాత్రలు పోషించాను. ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా నచ్చిన పాత్రలు వస్తే నటించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. క్రిష్ కు సైతం నేను సినిమాల్లో కొనసాగడం పట్ల ఎలాంటి అభ్యంతరాలు లేవు. పూర్తి సహకారం ఇస్తున్నారు' అంటూ సంగీత వివరణ ఇచ్చింది. తనతో పాటు క్రిష్ కూడా సినిమాల్లో నటించాలనుకుంటున్నారనీ, తగిన స్క్రిప్టు కోసం చూస్తున్నారనీ తెలిపింది. క్రిష్ కు సంగీతం అంతే పంచప్రాణాలనీ, నటుడిగా మారినా సంగీతానికి దూరం కాడనీ చెప్పుకొచ్చింది. నటనకు స్వస్తి చెప్పడం లేదని సంగీత వివరణతో మరికొన్ని ఆఫర్లు ఇవ్వడానికి నిర్మాతలకు కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు.
Be first to comment on this News / Article!
|