'ఛాలెంజింగ్ రోల్ మనోరమ'
'మనోరమ' చిత్రంలో తన పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా ఉంటుందనీ, క్రిష్టమైన పాత్రను ఇందులో పోషించాననీ ఆ చిత్ర కథానాయిక ఛార్మి తెలిపింది. జీ మోషన్ పిక్చర్స్ పతాకంపై పి.గోయెంకా నిర్మించిన ఈ చిత్రానికి ఈశ్వర్ రెడ్డి ('మీ శ్రేయోభిలాషి' ఫేమ్) దర్శకత్వం వహించారు. ముంబైకి చెందిన నిషాన్ హీరోగా నటించారు. తొలిసారి ఈ చిత్రం ప్రెస్ మీట్ ను జీ మోషన్ పిక్చర్స్ హైద్రాబాద్ లో నిర్వహించింది.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఒకరోజులో జరిగే కథతో ఈ చిత్రం రూపొందిందని ఛార్మి తెలిపింది. ఒకరోజు కథ కావడంతో కాస్ట్యూమ్స్ మార్చేందుకు అవకాశం లేదనీ, ఇందువల్ల సాధ్యమైనంత వరకు ఓ సారి టోపీ, మరోసారి బ్యాగ్ తో ఇలా చిన్న చిన్న మార్పులతో మేకప్ లేకుండా నటించాననీ చెప్పారు. కేవలం 30 రోజుల్లో షూటింగ్ పూర్తయిందన్నారు. ఇందులో 'లైఫ్ అంటేనే ఎంజాయ్' అనే అద్భుతమైన సాంగ్ ఉందనీ, ఈ సినిమా థీమ్ మ్యూజిక్ తన మొబైల్ లో డైలర్ టోన్ చేసుకున్నాననీ తెలిపారు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా కొత్తదనంతో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారని అన్నారు. ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమోషనల్ డ్రామాతో రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉంటుందనీ, ఈనెల 21న ఆడియో, 27న ఉగాది కానుకగా సినిమా విడుదలవుతుందన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ మాట్లాడుతూ, మంచి సినిమాలు తీయాలనే తపనతో తమ సంస్థ నిర్మాణరంగంలోకి వచ్చిందనీ, ఈశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించారనీ చెప్పారు. డిజిటల్ ఫార్మెట్ లో తీయడంతో క్వాలిటీ కూడా అద్భుతంగా వచ్చిందన్నారు. మంచి ఫీల్ ఉన్న పాత్రను ఛార్మి పోషించిందని అన్నారు. ఈ సినిమా కోసం ఓ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ పాడినట్టు సంగీత దర్శకుడు కోటి తెలిపారు. హీరో నిషాన్, చిత్ర యూనిట్ కు చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|