'బిల్లా' ఆడియో విడుదల
ప్రభాస్, అనుష్క జంటగా శ్రీ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై యు.కృష్ణంరాజు సమర్పించిన చిత్రం 'బిల్లా'. మెహర్ రమేష్ ('కంత్రీ' ఫేమ్ ) దర్శకుడు. ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రం ఆడియో వేడుక బుధవారం రాత్రి శిల్పకలా వేదిక ఆడిటోరియంలో కన్నులపండువగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు, మెహర్ రమేష్, నమిత, మణిశర్మ తదితరులతో పాటు దర్శకరత్న దాసరి నారాయణరావు, వి.వి.వినాయక్, ఎస్.ఎస్.రాజమౌళి, మురళీమోహన్, అల్లు అర్జున్, గోపీచంద్, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, బివిఎస్ ఎన్ ప్రసాద్, దిల్ రాజు తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దాసరి నారాయణరావు ఆడియోను ఆవిష్కరించి తొలి ప్రతిని కృష్ణంరాజుకు అందజేశారు. లహరి మ్యూజిక్ ద్వారా ఈనెల 20న నుంచి ఆడియో మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.
దాసరి నారాయణరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సినిమా ప్రతిష్ఠాత్మక బ్యానర్లలో గోపీకృష్ణ మూవీస్ ఒకటనీ, కృష్ణంరాజుతో తాను ఎన్నో గుర్తుండిపోయే చిత్రాలు తీశాననీ చెప్పారు. నిర్మాణ విలువల విషయంలో కృష్ణంరాజు ఎప్పుడూ రాజీ పడలేదనీ, అప్పట్లో తాండ్రపాపారాయుడు సినిమా కోసం రోజులు 2 లక్షలు ఖర్చు చేశారనీ, అదే ఈ రోజు అయితే 50 కోట్లు అవుతుందనీ అన్నారు. ప్రభాస్ కు సరైన నట వారసుడు ప్రభాస్ అనీ, అతను రాబోయే రోజుల్లో మరిన్ని సంచనాలు సృష్టించడం ఖాయమనీ అన్నారు. మెహర్ రమేష్ కంత్రీ అయితే, ప్రభాస్ డబుల్ కంత్రీ అని చమత్కరిస్తూ ఈ చిత్రం బాగా ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ, పదిహేనేళ్ల తర్వాత మళ్లీ సొంత బ్యానర్ లో ఈ సినిమాను చేసినట్టు చెప్పారు. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో తీశారనీ, తమ బ్యానర్ ప్రతిష్టను పెంచే సినిమా ఇదని గర్వంగా చెప్పగలననీ అన్నారు. మెహర్ రమేష్, ఛాయాగ్రాహకుడు సౌందరాజన్, మణిశర్మ కలిసి ఎంతో రిచ్ వాల్యూస్ ఉన్న సినిమాగా దీనిని తీర్చిదిద్దారని అన్నారు. ఈ చిత్రంలోని ఓ సాంగ్, ప్రమో చూశాననీ, ప్రభాస్ తప్పనిసరిగా హృతిక్ రోషన్ తో సరిపోల్చదగినవాడని చెప్పగలననీ రాజమౌళి పేర్కొన్నారు. ప్రభాస్ ఆరగడుల బంగారమనీ, మనసు వెన్న అనీ, తన ఫ్యామిలీ హీరోలను పక్కనబెడితే బయట హీరోల్లో ప్రభాస్ తన ఫేవరెట్ హీరో అనీ అల్లు అర్జున్ పేర్కొన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ, పెదనాన్న కృష్ణంరాజుతో నటించడం ఇదే తొలిసారనీ, ఆయనతో కలిసి నటించడం వినూత్నమైన అనూభూతినిచ్చిందనీ చెప్పారు. యూనిట్ సభ్యులంతా ఎంతో అకింత భావంతో, ప్యాషన్ తో ఈ సినిమాకు పనిచేశారని చెప్పారు. వారికీ, తనకు ఎప్పుడూ అండగా నిలుస్తున్న అభిమానులకూ తన కృతజ్ఞతలని పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|