'పూజ పుష్పాలు' ఆల్బమ్
సీనియర్ నిర్మాత జగపతి రాజేంద్ర ప్రసాద్ మనుమరాలు పూజ గానం చేసిన భక్తిపాటల ఆల్బమ్ 'పూజ పుష్పాలు'. పూజ చేసిన మూడో ఆల్బమ్ ఇది. ఫిలింనగర్ దైవసన్నిధానంలో బుధవారం సాయంత్రం ఈ అల్బమ్ ను విడుదల చేశారు. మురళీ మోహన్, జగపతి రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, ఆల్బమ్ సంగీత దర్శకుడు బంటి, పూజ, శ్రీమతి రాజేశ్వరి, రమేష్ ప్రసాద్, పూజ తల్లిదండ్రులు శోభాప్రసాద్, రామ్ ప్రసాద్, పూజ అక్క నిత్య, ప్రముఖ హిందీ నటి సుస్మితా సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆడియో సీడీని సుస్మితా సేన్ ఆవిష్కరించి తొలి ప్రతిని జగపతిబాబుకు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో ఆల్బమ్ విడుదలైంది.
సుస్మితాసేన్ మాట్లాడుతూ, చిన్నప్పట్నుంచీ తనకు పూజ తెలుసనీ, పదహారేళ్ల వయసులోనే మూడు ఆల్బమ్స్ చేయడం చాలా గొప్ప విషయమనీ అన్నారు. పూజ పాటలు వింటుంటే ఆ దేవుడి సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుందనీ, ప్రతి ఒక్కరూ ఆమె పాడిన పాటలు విని ఆశీర్వించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఈ అల్బమ్ లోని 'మా దుర్గా శక్తి దే...' అనే పాటను సుస్మితాసేన్ స్వయంగా రాసిందనీ, పూజ గాత్రంతో ఆ పాటను రికార్డు చేసి క్యాసెట్ ను సుస్మితకు పంపామనీ, పూజ గాత్రానికి ఆనందించి నేరుగా ఆమె ముంబాయి నుంచి ఆడియో వేడుకలో పాల్గొనేందుకు విచ్చేశారనీ చెప్పారు. అల్బమ్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుని వికలాంగులకు వినియోగించనున్నారని చెప్పారు. మురళీమోహన్ మాట్లాడుతూ, కొద్దిపాటి ప్రయత్నం ఎవరైనా సరే నటుడు, రాజకీయానాయకుడు కావచ్చనీ, అందరూ గాయకులు కాలేరనీ, గాత్రం అనేది భగవంతుని వరమనీ అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ, పూజ గతంలో చేసిన రెండు ఆల్బమ్స్ తరహాలోనే ఈ అల్బమ్ కూడా మంచి సక్సెస్ కావాలని, ఆమెకు బంగారు భవిష్యత్ ఉండాలనీ కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. సంగీత దర్శకుడు బంటి మాట్లాడుతూ, పూజా ప్రసాద్ తన హాలిడేస్ అన్నింటినీ ఈ అల్బమ్ కోసం వెచ్చించిందనీ, గత ఆల్బమ్స్ కంటే కూడా ఎంతో బాగా ఈ ఆల్బమ్ వచ్చిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో తన సంగీత గురువు రాజేశ్వరి, సంగీత దర్శకుడు బంటిని పూజ సత్కరించారు.
Be first to comment on this News / Article!
|