రామ్ చరణ్ 'రోడ్ షో'
నిన్నటి 'చిరుత', నేటి 'మగధీర' రామ్ చరణ్ ఇప్పుడు 'రోడ్ షో'లకు కూడా రెడీ అవుతున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు ఇవి 'ప్రజారాజ్యం' పార్టీ తరఫున పొలిటికల్ క్యాంపైన్ లో భాగంగా జరిపే రోడ్ షోలు కాదు. కార్పొరేట్ సంస్థల వినూత్న ప్రచారంలో భాగంగా రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా రోడ్డు మీదకు రాబోతున్నారు. సహజంగా బాగా పేరువచ్చిన స్టార్ లనే కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తులకు 'అంబాసిడర్లు' గా ఉపయోగించుకుంటారు. చిరంజీవి 'థమ్సప్', 'నవరతన్ ఆయిల్' కు (ఇప్పుడు మహేష్ వీటికి బ్రాండ్ అంబాసిడర్) , పవన్ 'పెప్సీ'కి, అల్లు అర్జున్ '7 అప్'కీ బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయగా, కేవలం ఒకే ఒక్క సినిమాతో రామ్ చరణ్ తాజాగా 'పెప్సీ' బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవల ముంబైలో కొన్ని గంటల సేపు యాడ్ షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొన్నారు. ఇందులో ఆయనతో పాటు 'ఓం శాంతి ఓం' ఫేమ్ దీపక పడుకునే కూడా కనిపించబోతున్నారు.
ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ దగ్గరపడుతుండటం, మరోవైపు ఎండలు ముదురుతుండటం సరైన సీజన్ గా భావించిన 'పెప్సీ' రామ్ చరణ్ ను రంగంలోకి దింపుతోంది. ఇందుకు తగ్గట్టుగానే 'ఆంధ్రప్రదేశ్ లో మార్పు' అనే నినాదంతో పెప్సీ పెద్దఎత్తున ప్రచారానికి రంగం సిద్ధం చేస్తోంది. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీ నినాదం 'మార్పు కోసం' కాగా, అందుకు దగ్గరగా ఉండేలా పెప్సీ నినాదాన్ని రెడీ చేశారు. ఎన్నికల వేళ ఈ నినాదం జనంలోకి వెళ్లి తమకు మంచి మార్కెట్ లభిస్తుందనేది ఓ స్ట్రాటజీ. ఇందుకు గాను రామ్ చరణ్ రెండు నెలల పాటు రోడ్ షోలో పాల్గొనేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా భారీ హోర్డింగ్ లు, బ్యానర్లు, లఘు చిత్రాల ప్రదర్శనలు కూడా చేపట్టేందుకు పెప్సీ ఏర్పాటు చేస్తోంది. 'ప్రజారాజ్యం' తరఫున కాకపోయినా చరణ్
వేరేరూపంలో 'రోడ్ షో' జరిపినా అది పార్టీకి అనుకూలించే అంశమే అవుతుందని ఆ పార్టీ అభిమానులు సైతం ఎంతో ఉత్సుకత కనబరుస్తున్నారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత రాకుంటే రామ్ చరణ్ 'రోడ్ షో'లకు తిరుగుండదు.
Be first to comment on this News / Article!
|