'భవానీ ఐపిఎస్'గా స్నేహ
బాపు బొమ్మగా 'రాధాగోపాళం', ఆదర్శ ఇల్లాలుగా 'శ్రీరామదాసు' వంటి పలు చిత్రాల్లో నటించిన అందాల నటి స్నేహ ఇప్పుడు 'కర్తవ్యం'లో విజయశాంతి తరహాలో తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకుని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా 'భవానీ ఐపిఎస్' అనే కొత్త చిత్రంలో నటిస్తోంది. 'కర్తవ్యం' కథకు దగ్గరగా తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని జి.కిచ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామానాయుడు సినీ విలేజ్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. సెట్స్ లోని చిత్రయూనిట్ గురువారంనాడు ఆ విశేషాలను తెలియజేసింది.
దర్శకనిర్మాత కిచ మాట్లాడుతూ, తమిళంలో తాను ఐదు సినిమాలు చేశాననీ, లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ చెప్పారు. ఇందులో లేడీ ఐపిఎస్ గా స్నేహ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తోందన్నారు.. పది శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉందనీ, గత 20 రోజులుగా హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుతున్నామనీ చెప్పారు. త్వరలోనే రెండుభాషల్లోనూ ఏకకాలంలో సినిమా విడుదల చేస్తామని అన్నారు. స్నేహ మాట్లాడుతూ, ఇంతవరకూ తాను శ్రీరామదాసు, రాధాగోపాళం వంటి చిత్రాల్లో సాఫ్ట్ రోల్స్ చేశాననీ, తొలిసారి రఫ్ అండ్ టఫ్ పాత్ర పోషిస్తున్నాననీ, ఇది పూర్తిగా తనకు కొత్త అనూభూతినిస్తోందనీ చెప్పారు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నమ్మలేకపోయాననీ, నిజంగానే తనతోనే ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించాననీ చెప్పారు. నీతోనే ఈ సినిమా చేయాలని అనుకుంటున్నట్టు ఆయన నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేయడంతో ఆ పాత్ర తన చేతికి వచ్చిందనీ, తన పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాననీ చెప్పారు. నేటి సమాజ స్థితిగతలకు ఈ చిత్రం అద్దంపడుతుందని ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న కోట శ్రీనివాసరావు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సంపత్ రాజ్, రాజ్ కపూర్, ఇళవరసు, ఆర్యన్, పొన్నాంబళం తదితరులు నటిస్తున్నారు. భూపతి సినిమాటోగ్రఫీ, ధన సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|