ప్రభాకర్ 'ర్యాగింగ్'
కళాశాలల్లో జూనియర్లను సీనియర్లు సరదాగా ఆటపట్టించడాన్ని ర్యాగింగ్ అని పిలుస్తుంటాం. అయితే ఇప్పుడు ర్యాగింగ్ అనేది వికృతరూపం దాల్చి బాధితులైన విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీస్తోంది. కొందరు మధ్యలోనే చదవులకు స్వస్తి చెప్పాల్సి వస్తోంది. చట్టాలకు ఎప్పటికప్పుడు మరింత పదును పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీనినే ఇతివృత్తంగా తీసుకుని కాకతీయ ఫిలిమ్స్ పతాకంపై 'ర్యాగింగ్' అనే చిత్రాన్ని రూపొందించనున్నారు.
తెలంగాణాలో సంప్రదాయంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ ఇతివృత్తంతో కాకతీయ ఫిలిమ్స్ సంస్థ ఇటీవల 'బతుకమ్మ' అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఆ చిత్రం చక్కటి ప్రజాదరణ చూరగొంది. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు సమకాలీన ఇతివత్తంతో 'ర్యాగింగ్' చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్టు నిర్మాత పానుగొంటి రామమోహన్ రావు, మక్కపాటి చంద్రశేఖర్ రావు తెలిపారు. తమ తొలి చిత్రానికి
దర్శకత్వం వహించిన టి.ప్రభాకర్ ఈ చిత్రానికి మంచి కథ రెడీ చేశారనీ, ఆయనే ఈ చిత్రానికి కూడా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించనున్నారనీ పేర్కొన్నారు. ఒక యువ హీరో ఈ చిత్రంలో నటించనున్నారనీ, త్వరలోనే ఈ చిత్రం ప్రారంభమవుతుందనీ తెలిపారు. దర్శకుడు టి.ప్రభాకర్ మాట్లాడుతూ, విద్యార్థులను ఆలోచింపజేసే సందేశంతో పాటు ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ హంగులూ ఉంటాయని చెప్పారు. ర్యాంగింగ్ బారిన పడిన పలువురు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కలుసుకోవడంతో పాటు, పలు యూనివర్శిటీలను కూడా సందర్శించి విషయం సంగ్రహం చేసినట్టు ఆయన తెలిపారు. 'బతుకమ్మ' చిత్రాన్ని తీసిన నిర్మాతలే మళ్లీ ఈ సినిమా ఈ నిర్మాణ బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందనీ, త్వరలోనే ఈ చిత్రంలోని నటీనుటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
Be first to comment on this News / Article!
|