సమ్మర్ లో 'సరే నీ ఇష్టం'
సమ్మర్ యువహీరోల రేసులో ఇప్పుడు మరో నట వారసుడు శాంతన్ భాగ్యరాజా కూడా పోటీపడబోతున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజా తనయుడే ఈ శాంతన్. 'సరే నీ ఇష్టం' అనే ప్రేమకథా ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయనకు జోడిగా అంద్రిత నటిస్తోంది. పూర్ణ చంద్ర మూవీ మేకర్స్ పతాకంపై మహేష్ చంద్ర (చంద్రమహేష్ ) దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్టు చిత్రయూనిట్ తెలియజేసింది.
రొటీన్ చిత్రాలను చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ప్రస్తుతం కొత్తదనం కోరుకుంటున్నారనీ, అలాంటి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామనీ దర్శకుడు మహేష్ చంద్ర తెలిపారు. రెండ్రోజుల క్రితమే షూటింగ్ పూర్తయిందనీ, నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నామనీ చెప్పారు. టైటిల్ కు తగ్గట్టే ఇది వినోదాత్మక సంగీత భరిత ప్రేమకథా చిత్రమనీ, అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయనీ అన్నారు. సినిమాలోని ఆరు పాటల్లో రెండు పాటలు బ్యాంకాక్, పుకెట్, పటాయ్ లలో హీరోహీరోయిన్లపైన తీశామనీ, మరో పాటను సెట్ వేసి హీరోహీరోయిన్లపై రొమాంటిక్ సాంగ్ గా తీశామనీ చెప్పారు. చక్రి సంగీతంలో రూపుదిద్దుకున్న పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయన్నారు. ఈనెలలోనే ఆడియో, వేసవిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగబాబు, సాయాజీ షిండే, కోట, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, బాబుమోహన్, సుధాకర్, అన్నపూర్ణ, సన, కౌష, అపూర్వ తదితరులు నటించారు. మహేష్ చంద్ర, రమేష్ రెడ్డి, జీవితరెడ్డి, సోమారెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ఎ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ, హార్స్ మన్ బాబు ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|