'వరుడు' ఇక పరుగే...
ప్రిన్స్ మహేష్ బాబు మళ్లీ సెట్స్ మీద సందడి చేయనున్నారు. 'అతిథి' చిత్రం తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ఎట్టకేలకు అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వచ్చే వారం నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. దాదాపు ఈ చిత్రం ఇక వెలుగుచూసే అవకాశం లేదంటూ బలమైన ఊహాగానాల నేపథ్యంలో ఈనెలలోనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా సినిమా ప్రారంభమై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. 'అతడు' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ చిత్రం వస్తుండటంతో సహజంగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇందుకు తగ్గట్టే ప్రముఖ నిర్మాత సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని మహేష్ చిత్రాల్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించేందుకు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ విషయంలో తలెత్తిన ప్రతిష్ఠంభనను తొలగిస్తూ ఇటీవల మహేష్ కు జోడిగా అనుష్కను ఎంపిక చేయడంతో ఒక్కసారిగా ఇది మరింత క్రేజీ ప్రాజెక్ట్ అయింది.
తొలుత పార్వతి మిల్టన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినప్పటికీ ఆ తర్వాత మార్పు అనివార్యమైంది. 'అరుంధతి' చిత్రంతో అనుష్కకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరో హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఈనెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ లో మొదలవుతుందనీ, మహేష్ మాత్రం 26 నుంచి సెట్స్ పైకి అడుగుపెడతారనీ యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే జరిగిన జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో సినిమాను పూర్తి చేయాలని త్రివిక్రమ్-మహేష్ పట్టుదలగా ఉన్నారనీ, ఆరు నెలల్లోగా షూటింగ్ పూర్తి చేసి దీపావళి కానుకగా సినిమా విడుదల చేసే అవకాశాలున్నాయని వారు తెలిపారు. హైద్రాబాద్ తో పాటు రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగనున్న ఈ చిత్రానికి విజయన్ ఫైట్స్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|