రాజ్ అదిత్య ఆత్మహత్య
సౌమ్యుడు, ప్రతిభావంతుడుగా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రాజ్ ఆదిత్య శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్ లోని బసేరా హోటల్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నారు. ఆయన వయస్సు 38 సంవత్సరాలు. సుమంత్ కథానాయకుడుగా నటించిన 'పౌరుడు' చిత్రం ద్వారా రాజ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా పెట్టుబడిని రాబట్టుకోగలిగింది. ద్వితీయ ప్రయత్నంగా స్కంద, కల్యాణి అనే కొత్త హీరోహీరోయిన్లను పరిచయం చేస్తూ దినేష్ కుమార్ నిర్మించిన 'మళ్లీ మళ్లీ' అనే ప్రమేకథా ఇతివృత్తానికి రాజ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ శనివారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన సినిమా విడుదలైన రోజో ఆయన ఆత్మహత్య చేసుకోవడం పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇందుకు కారణాలేమిటనేవి ఇంకా తెలియరాలేదు. అయితే శుక్రవారంనాడు ఆయన సెన్సార్ కార్యక్రమాలతో టెన్షన్ గా కనిపించారని ప్రత్యక్ష సాక్షుల కథనం.
రాజ్ ఆదిత్య 'మళ్లీ మళ్లీ' చిత్రం కథ కూడా ఇవాల్టి సంఘటనకు దగ్గరగా ఉండటం యాదృచ్ఛికం కూడా కావచ్చు. ఇందులో కథానాయకుడు నంద మంచి ఉద్యోగం చూసుకుని జీవితంలో స్థిరపడాలని అనుకుంటాడు. అయితే దురదృష్టం వెంటాడుతుంది. అవమానాలు ఎదురవుతాయి. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని చావుకు దగ్గరగా కూడా వెళ్తాడు. చివరి నిమిషంలో ఆలోచన మార్చుకుని బతుకు పోరాటానికే సిద్ధపడతాడు.కేరళకు చెందిన రాజ్ అదిత్య చెన్నైలోనే పెరిగారు. ఆయన తండ్రి సాయి కుమరన్ మలయాళంలో రచయిత, దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు. రాజ్ ఆదిత్య ఎంకామ్, పిజిడిఎసి (కంప్యూటర్స్ ) చేశారు. దర్శకత్వంపై ఉన్న మక్కువతో ప్రియదర్శన్ వద్ద అనేక చిత్రాలకు అసిస్టెంట్ గా పనిచేశారు. మలయాళ 'చంద్రలేఖ', హిందీ 'హేరాపేరి', 'హంగామా' వంటి పలు చిత్రాలకు ఆయన పనిచేశారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో తెలుగులో తొలిసారి 'పౌరుడు' చిత్రానికి దర్శకుడిగా అవకాశం లభించింది. 'మళ్లీ మళ్లీ ' చిత్రం నిర్మాణంలో ఉండగానే తరుణ్ హీరోగా మరో చిత్రానికి కూడా ఆయనకు ఆఫర్ వచ్చింది. సుప్రీంరాజు ఈ చిత్రానికి నిర్మాత. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు కూడా జరుగుతున్న తరుణంలో రాజ్ ఆదిత్య ఆత్మహత్యకు పాల్పడటంతో ప్రతిభావంతుడైన ఒక యువ దర్శకుడిని పరిశ్రమ కోల్పోయింది.
Be first to comment on this News / Article!
|