శోభన్ బాబు విగ్రహావిష్కరణ
ఆంధ్రుల అందాల నటుడు, నటభూషణ శోభన్ బాబు ప్రథమ వర్ధంతిని రాజమండ్రిలో శుక్రవారంనాడు నిర్వహించారు. గోదావరి ఒడ్డున ఉన్న గౌతమి నందనవనంలో శోభన్ బాబు కాంస్య విగ్రహాన్ని కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. శోభన్ బాబుతో గతంలో పలు చిత్రాలను నిర్మించి, శోభన్ బాబు విగ్రహం ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచిన రాశీ మూవీస్ అధినేత ఎం.నరసింహారావు, స్థానిక ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్, మేయర్ అదిరెడ్డి వీరరాఘవమ్మ, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, టిడిపి జనరల్ సెక్రటరీ గోరట్ల బుచ్చయ్య చౌదరి, బిజెపి జనరల్ సెక్రటరీ సోము వీర్రాజు, పెద్ద ఎత్తున అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై శోభన్ బాబుకు శ్రద్ధాంజలి ఘటించారు.
శోభన్ బాబు జీవితం మచ్చలేని శ్వేతపత్వం వంటిదనీ, క్రమశిక్షణ, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యం, పనితీరు, కుటుంబ క్రమశిక్షణ వంటివి ఎలాగ ఉండాలో ఆయన జీవితం చూసి అంతా నేర్చుకోవచ్చనీ దాసరి అన్నారు. 59వ ఏట సినిమాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన నటుడు ఆయన ఒక్కరేనని శ్లాఘించారు. ఆ మహానటుడు నేడు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మనవెంటే ఉంటాయనీ పేర్కొన్నారు. అనంతరం ఆనం కళాకేంద్రంలో జరిగిన శోభన్ బాబు వర్దంతి కార్యక్రమంలోనూ దాసరి పాల్గొన్నారు. శోభన్ బాబును చూసి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఇండస్ట్రీ వారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పనివేల తర్వాత ఎన్ని గంటలు కుటుంబానికి కేటాయిస్తున్నామనే విషయాన్ని పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ ఆయన జీవితం నుంచి
నేర్చుకోవచ్చన్నారు. శోభన్ బాబు ఎప్పుడూ తన సహచర ఆర్టిస్టులను సినిమాలు నిర్మించి చిక్కుల్లో పడవద్దని సూచించేవారని తెలిపారు. శోభన్ బాబు సేవా సమితిని తాము స్థాపించినట్టు ఎం.సుధాకర్ తెలిపారు. శోభన్ బాబు విగ్రహావిష్కరణకు సహకరించిన రాశీ ఫిలిమ్స్ అధినేత ఎం.నరసింహారావు, పూడి శ్రీనివాసరావు తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అరుణ్ కుమార్, బుచ్చయ్య చౌదరి, ఎమెల్సీ దుర్గేష్, శ్రీమతి వీరరాఘువమ్మ, సోము వీర్రాజు తదితరులు ఈ సందర్భంగా శోభన్ బాబు జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
Be first to comment on this News / Article!
|