'మేస్త్రి'కి బెదిరింపులు!
ఎన్నికల తరుణంలో దాసరి 'మేస్త్రి' అవతారమెత్తడం, తీరా సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు 'ప్చ్' అంటూ ముఖాలు వేలాడేస్తుండటం ఇప్పుడు ప్రధాన చర్చ అవుతోంది. రాజకీయ సినిమాల పట్ల కొద్దోగొప్పో ఆసక్తి ఉన్న వారు సైతం దాసరి 'ఇస్త్రీ' చేసేశారంటూ అనుకోవడమూ జరుగుతోంది. మేస్త్రి ప్రధాన టార్గెట్ చిరంజీవే అయినందున దాసరి నమ్ముకున్న పార్టీకి సైతం పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు సైతం సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల తరుణంలో రాజకీయాల్ని భుజాన్నేసుకుని చిన్నా చితకా సినిమాలు ఇలా వచ్చి అలా ఒకటి రెండు వారాలు ఆడి వెళ్లిపోతాయంటూ అల్లు అరవింద్ ఇప్పటికే ఆ సినిమాపై చురక వేశారు. ఈ సినిమా థీమ్, తన వ్యంగ్యాస్త్రాలు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చకు దారితీస్తాయనీ, కమర్షియల్ బ్రేక్ తప్పదనీ దాసరి భావించి ఉండొచ్చనీ, అయితే ఎవరూ కావాలని రచ్చచేసి సినిమాకు పబ్లిసిటీ బూస్టప్ చేయాలని అనుకోవడం లేదనీ విశ్లేషకుల ఉవాచ. ఈ క్రమంలో తన సినిమా రెండో వారంలోకి అడుగుపెట్టడంతో...తొలివారంలో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు వసూలు చేసిందంటూ 'మేస్త్రి' పబ్లిసిటీ పోస్టర్లు కూడా వెలిశాయి. దీనికి తోడు 'నన్ను బెదరిస్తున్నారు' అంటూ దాసరి తాజాగా మీడియాకు వివరించారు.
శోభన్ బాబు విగ్రహావిష్కరణకు శుక్రవారంనాడు రాజమండ్రి వచ్చిన దాసరి తనదైన శైలిలో మాట్లాడుతూ, 'మేస్త్రిని చూసి ఉలుకెందుకు? ఎక్కడో పాకిస్తాన్ లో బాంబు పేలితే మన ఇంట్లో పేలిందంటూ కొందరు ఉలిక్కిపడుతున్నారు. అంత అవసరం లేదు. సినిమాల సందేశాలను స్ఫూర్తితోనే తీసుకోవాలి' అంటూ హితోక్తి పలికారు. మనం ఎక్కే రైలు ఇంకా ఆలస్యమవుతుంది, మా దగ్గరేముంది బూడిద...వంటి డైలాగ్స్ గతంలోనూ తన సినిమాల్లో వాడననీ, అప్పట్లో 'ఎమ్మెల్యే ఏడుకొండలు' తీస్తే చెన్నారెడ్డి మీద తీశానంటూ ప్రచారం చేశారనీ, నిజానికి చెన్నారెడ్డీ, తానూ కలిసే ఆ సినిమా చూశామనీ చెప్పారు. ఇప్పుడు 'మేస్త్రి' తీసిన తర్వాత కొందరు తన ఇంటిపై దాడి చేస్తామంటూ బెదరిస్తున్నట్టు చెప్పారు. సినిమాలు ఎవరి కోసమో, ఎవరిని ఉద్దేశించో తీయమనీ, ఇందులో తాము చూపించిన సందేశాన్ని స్ఫూర్తిగానే తీసుకోవాలనీ చెప్పారు. ఇంత చెప్పిన దాసరి అసలు తననెవరు బెదరించారో చెప్పకుండా దాటవేశారు.
Be first to comment on this News / Article!
|