మీనా 'వెంగమాంబ' ప్రారంభం
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవకే అంకింతమైన కవయిత్రి, భక్తురాలు తరిగొండ వెంగమాంబ జీవిత కథ వెండితెరకెక్కుతోంది. 'అన్నమయ్య' వంటి భక్తిరస ప్రధాన చిత్రాన్ని అందించిన దొరస్వామిరాజు వి.ఎం.సి. ఫిలింస్ పతాకంపై 'వెంగమాంబ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ భాస్కర్ దర్శకుడు. శనివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. వేంకటేశ్వర స్వామి పాత్ర పోషిస్తున్న సాయికిరణ్, వెంగమాంబ పాత్రధారి మీనాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి సీనియర్ నిర్మాత డి.వి.ఎస్.రాజు క్లాప్ ఇవ్వగా, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
సాయికిరణ్ మాట్లాడుతూ, వేంకటేశ్వర స్వామి పాత్రను పోషించే అవకాశం రావడం తన సుకృతంగా భావిస్తున్నాననీ, తన కెరీర్ లోనే ఇది ఒక మంచి పాత్రగా నిలిచిపోతుందని భావిస్తున్నాననీ అన్నారు. వెంగమాంబ పాత్రధారి మీనా మాట్లాడుతూ, తాను విఎంసి ఫిలింస్ బ్యానర్ లోనే హీరోయిన్ గా పరిచయమయ్యాయనీ, మళ్లీ అదే బ్యానర్ లో నటిస్తుండటం, అందులోనూ వెంగమాంబగా నిజ జీవిత పాత్రను పోషిస్తుండటం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానీ అన్నారు. 18-19 శతాబ్దాలలో జీవించిన తరిగొండ వెంగమాంబ భక్తురాలు, రచయితే కాకుండా మంచి సంఘ సంస్కర్త అనీ, ఇటీవల అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయనీ అన్నారు. శక్తివంచన లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని చెప్పారు. హైదరాబాద్ , తిరుపతిలలో షూటింగ్ ప్లాన్ చేశామనీ, జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నామనీ నిర్మాత దొరస్వామిరాజు తెలిపారు. ఈ చిత్రంలో శరత్ బాబు ఓ కీలక పాత్రను పోషించనుండగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|