సిఎం ఎవరు?
ఎన్నికల సీజన్ ముంచుకొస్తుండటంతో పొలిటికల్ నేపథ్యంలో ముందస్తు ప్లానింగ్ తో నిర్మాణం పూర్తి చేసుకున్న పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 'మేస్త్రి' చిత్రంతో దర్శకరత్న దాసరి నారాయణరావు బోణీ కొట్టారు. జగపతిబాబు 'అధినేత', మరో బ్యానర్ లో 'నేనే ముఖ్యమంత్రినైతే', పోసాని 'రాజావారి చేపలచెరువు' వంటి పొలిటికల్ సినిమాలు ఇప్పటికే ఎన్నికల తొలి షెడ్యూల్ కు ముందే విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా 'ప్రజా నాయకుడు' అనే కొత్త చిత్రం కూడా రెండ్రోజుల క్రితమే షూటింగ్ మొదదలైంది. ఎన్నికలకు కొద్దిగా ముందు ఏప్రిల్ రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నారు.
దాసరి నారాయరావు 'మేస్త్రి' చిత్రానికి దర్శకుడు కాకపోయినా టైటిల్ పాత్ర పోషించి పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు తెరతీశారు. చిరంజీవి, ఆయన పొలిటికల్ పార్టీ, ఎజెండా వంటి వాటిని ఇందులో పరోక్ష ప్రస్తావన చేశారు. ఈ క్రమంలో 'ప్రజానాయకుడు' సినిమా చిరంజీవికి సపోర్టింగ్ గా ఉండబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి పాజిటివ్ ఇమేజ్ ను కల్పించే విధంగా ఈ చిత్రం నడక ఉంటుందట. ఒక సినీనటుడు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను సమూలంగా ఎలా ప్రక్షాళన చేశారు, సామాన్యుల కడగండ్లను ఎలా తీర్చారన్నదే ఈ చిత్ర ఇతివృత్తంగా తెలుస్తోంది. శ్రీ అమ్మ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి.రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పిసి ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఎవరు, ఎలా చేపట్టారన్నదే ఇందులో ప్రధానాంశమనీ, ఏ రాజకీయ పార్టీనీ విమర్శించే ఉద్దేశం తమకు లేదనీ ఆదిత్య నమ్మబలుకుతున్నారు. సత్యనారాయణ, ప్రేమ్ కుమార్, జానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ముగ్గురూ చంద్రబాబు, చిరంజీవి, రాజశేఖర్ రెడ్డిని ముమూర్తులా పోలిన గెటప్ లతో కనిపించబోతున్నారు. ఆదిత్య చెప్పినట్టు ఆయన సినిమాలో సిఎం సీటు ఎవరికి దక్కుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Be first to comment on this News / Article!
|