బిల్లా..మసాలా మిర్చి పిల్లా!
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే పిల్లాడు పుడతాడని అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ 'బిల్లా' చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎకాఎకిన 'ప్రజారాజ్యం' పార్టీలో చేరడంతో ఇక మెగా ఫ్యాన్స్ నుంచి కూడా ఈ చిత్రానికి గట్టి సపోర్ట్ లభించడం ఖాయమైంది. ఇందులో కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తుండటంతో పాటు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై చిత్రాన్ని సమర్పిస్తున్నారు కూడా. ప్రభాస్ ఎన్నికల ప్రచార బరిలోకి రాడని కృష్ణంరాజు తేల్చిచెప్పినప్పటికీ ఆయన మాటే వేదవాక్కు కాబట్టి ప్రభాస్ కూడా పరోక్షంగా 'ప్రజారాజ్యం' సపోర్టర్ కిందే లెక్క. పనిలో పనిగా 'బిల్లా' చిత్రాన్ని ఏప్రిల్ 2న భారీ ప్రింట్లతో రిలీజ్ చేసేందుకు కూడా కృష్ణంరాజు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి 'మసాలా మిర్చి పిల్లా...'అనే పల్లవితో మొదలయ్యే ఓ పాటను ప్రస్తుతం వైజాగ్ లో ప్రభాస్, పలువురు గ్రూప్ డాన్సర్లపై చిత్రీకరిస్తున్నారు. ఈ గురువారంతో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.
తమిళంలో విజయవంతైన 'బిల్లా' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా అనుష్క నటిస్తోంది. నమిత మరో కీలక పాత్ర పోషిస్తుండగా, హన్సికా మోత్వాని ఓ స్పెషల్ ఐటెం సాంగ్ లో నర్తిస్తోంది. కృష్ణంరాజు పోలీసు ఆఫీసర్ గా మరో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ స్టాండర్స్ తో సినిమా చాలా రిచ్ గా తెరకెక్కుతోందనీ, ప్రభాస్ కెరీర్ లో ఇదో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందనీ దర్శకుడు మెహర్ రమేష్ చెబుతున్నారు. సినిమాకి అనుష్క గ్లామర్ హైలైట్ అనీ, బికినీలో కూడా కనిపించబోతోందనీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సౌందరాజన్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|