ఉగాది తెలుగుదనమేది?
సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ నే నిర్మాతలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఫిబ్రవరి అనుకూల మాసం కాదనే సెంటిమెంటూ ఉంది. దీంతో ఉగాది వరకూ చిన్నచితకా సినిమాలే థియేటర్లకు చేరుతుంటాడు. తొలి రెండున్నర మాసాల్లో 'అరుంధతి' సూపర్ హిట్ గా నిలిస్తే, 'మస్కా' హిట్ ముద్ర వేయించుకుంది. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' వంటి ఒకటి రెండు చిత్రాలు 50 మార్క్ వేయించుకున్నాయి. ఈ క్రమంలో తెలుగు సంవత్సరాదిగా చెప్పుకునే ఉగాది రోజున పలు సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోసం సిద్ధమవుతున్నాయి. ఒకేరోజు ఐదారు సినిమాలు రిలీజ్ అవుతున్నా స్ట్రయిట్ సినిమాలతో పాటు అనువాద చిత్రాలు కూడా ఈసారి పోటీపడుతుండటంతో తెలుగుదనం తగ్గింది. ఆసక్తికరంగా ఉగాదికి విడుదలవుతున్న చిత్రాల్లో కన్నడ అనువాద చిత్రం 'బుద్ధిమంతుడు ('ఉప్పిదాదా') 60 ప్రింట్లతో 100 థియేటర్లరో విడుదలవుతూ స్ట్రయిట్ తెలుగు చిత్రాల కంటే ప్రింట్ల పరంగా తనదే పైచేయి అనిపించుకుంటోంది. ఒక్క హైద్రాబాద్ లోనే 25 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.
సక్సెస్ ల పరంగా మడం తిప్పని నిర్మాతగా పేరున్న దిల్ రాజు కూడా ఈసారి ఉగాది బరిలోకి 'ఆకాశమంత' చిత్రాన్ని దింపుతున్నారు. ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా ఇందులో కనిపిస్తారు. నిజానికి ఇది కూడా స్ట్రయిట్ తెలుగు చిత్రం కాదు. 'అభియుం నానుమ్' పేరుతో ప్రకాష్ రాజ్ తమిళంలో నిర్మించిన చిత్రాన్నే దిల్ రాజు చిన్న చిన్న మార్పులతో 'ఆకాశమంత'గా రిలీజ్ చేస్తున్నారు. అంటే ముప్పాతికి అనువాదం, ఓ పాతిక రీమేక్ అన్నమాట. ఇక అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో విడుదలవుతున్న 'బీభత్సం' తమిళ, తెలుగు భాషల్లో రూపొందింది. ఎటొచ్చీ ఛార్మి కథానాయికగా వి.ఆశ్వర్ రెడ్డి ('మీ శ్రేయోభిలాషి' ఫేమ్) దర్శకత్వంలో రూపొందిన 'మనోరమ' చిత్రం మాత్రం ఉగాది తెలుగు ఫ్లేవర్ ను నిలుపుతోంది. చిన్నా చితకా సినిమాలు మరో రెండు కూడా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్నాయి. ప్రధానంగా క్లాస్ ముద్రతో వస్తున్న 'ఆకాశమంత', 'మనోరమ', మాస్ ఫ్లేవర్ తో వస్తున్న 'బుద్ధిమంతుడు' చిత్రాల మధ్యే ప్రధాన మైన పోటీ ఉండొచ్చు. ఎవరిది పైచేయి అనేది ఉగాది తర్వాతే తేలుతుంది.
Be first to comment on this News / Article!
|