ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. అనుష్కతో కలిసి కొన్ని రొమాంటిక్ ఘట్టాల్లో తలమునకలవుతున్నారు. విషయం అర్ధమయ్యే ఉంటుంది. ఈ ఇద్దరూ జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ ఈ బుధవారమే అన్నపూర్ణ స్టూడియోస్ లో రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణతో మొదలైంది. తొలుత స్టంట్ మాస్టర్ విజయన్ నేతృత్వంలో ఫైటింగ్ ఘట్టాలతో షూటింగ్ ప్రారంభించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించినప్పటికీ ఇప్పుడు ప్లానింగ్ లో మార్పు చోటుచేసుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు బెడ్ రూమ్ సెట్ లో అనుష్కను మహేష్ టీజ్ చేసే రొమాంటిక్ ఘట్టాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలి సన్నివేసాలుగా చిత్రీకరిస్తున్నారు. మూడు వారాల పాటు ఈ తొలి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. అనంతరం నాసిక్, కేరళ లో వరుస షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు.
'అతిథి' చిత్రం తర్వాత దాదాపు పద్దెనిమిది నెలలు గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ఎట్టేకలకు మళ్లీ కెమెరా ముందుకు రావడం ఆయన అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. ఎప్పుడెప్పుడు ప్రోగ్రస్ వివరాలు తెలుస్తాయా అనే ఉత్సుకత కూడా వారిలో కనిపిస్తోంది. ఇదే ఊపులో మహేష్ వరుస సినిమాలు ప్లాన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయమూ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత సింగనమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వరుడు' అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. మహేష్ ఫేవరెట్ అయిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.