రామ్ చరణ్ హ్యాపీ బర్త్ డే
'ది రైజింగ్ సూపర్ స్టార్' రామ్ చరణ్ నేడు 24వ వసంతంలోకి అడుగుపెట్టారు. 'చిరుత'గా ఎంటరై ఇప్పుడు 'మగధీరుడు'గా సత్తా చూపించడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో వచ్చిన రామ్ చరణ్ బర్త్ డే ఇటు చరణ్ అభిమానులకూ, ముఖ్యంగా మెగాభిమానులకు డబుల్ బొనంజా అవుతోంది. ఈరోజు కొంగ్రొత్త ఆశల ఉగాది పండుగ కావడం, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తొలి విడత అభ్యర్ధులను ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం ద్విగుణీకృతమవుతోంది.
రామ్ చరణ్ తన సహజశైలిలోనే ఎలాంటి ఆడంబారాలకు తావివ్వకుండా తన బర్త్ డే వేడుకను ఈసారి కూడా కుటుంబ సభ్యుల, 'మగధీర' చిత్రం యూనిట్ సభ్యుల మధ్య జరుపుకొంటున్నారు. నటుడిగా రామ్ చరణ్ కు ఇది రెండో బర్త్ డే. 'చిరుత' చిత్రంతో తొలి చిత్ర నటుడిగా సక్సెస్ చవిచూసిన రామ్ చరణ్ కు ఈ ఏడాది మరింత కీలకం కాబోతోంది. బాబాయ్ పవన్ కల్యాణ్ చేసిన 'పెప్సీ'కి రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా యూత్ లో తన క్రేజ్ మరింత పెరిగే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. జోరున్న 'కొత్త పెప్సీ...జోరున్న యంగిస్థాన్' అనే నినాదంతో యువతను ఆకట్టుకునేలా ప్రచారం ప్రారంభించారు. నేరుగా బాలీవుడ్ స్టార్ దీపికా పడుకునే ఈ యాడ్ లో రామ్ చరణ్ సరసన హొయలొలికిస్తోంది. నటుడిగా, బ్రాండ్ అంబాసిడర్ గా తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తానని చెప్పడం వ్యక్తిగానూ, ఏడాదికి ఒక చిత్రంలోనే నటిస్తున్నా భవిష్యత్తులో ఎక్కువ చిత్రాల్లో నటిస్తానంటూ చెప్పడం ద్వారా వృత్తిపరంగానూ ఆయన తన కమిట్ మెంట్ ను చాటుకున్నారు. పునర్జన్మల నేపథ్యంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న 'మగధీర' చిత్రం ద్వారా ఈ సమ్మర్ లో ప్రేక్షకులను పలకరించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. బర్త్ డే బోయ్ కి బెస్ట్ విషెస్...
Be first to comment on this News / Article!
|