సివంగి'గా అర్చన
అర్చన (వేద) కథానాయికగా 'సివంగి' పేరుతో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. దీనికి 'ఎవరి మాట వినదు' అనే ట్యాగ్ లైన్ ఉంది. తెలుగు క్రియేషన్స్ పతాకంపై పి.ఆర్.బాబు నిర్మించనున్న ఈ చిత్రానికి టి.కృష్ణ దర్శకుడు. కమర్షియలతో ఆంశాలతో కూడిన మాస్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రమిదని టి.కృష్ణ హైదరాబాద్ లో శనివారంనాడు తెలియజేశారు.
గతంలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన తాను ఇటీవల తీసిన 'మహాయజ్ఞం' మంచి సందేశాత్మక చిత్రంగా పేరు తెచ్చుకుందనీ, దీనిని కూడా ఓ మంచి చిత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాననీ ఆయన చెప్పారు. ఏప్రిల్ మూడో వారంలో షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత బాబు తెలిపారు. కథాపరంగా కొన్ని సన్నివేశాలు, రెండు పాటలు బ్యాంకాక్ లో తీస్తామని చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ తనకెంతగానో నచ్చిందనీ, ఇందులో తన పాత్రకు రెండు పార్శ్వాలు ఉంటాయనీ అర్చన తెలిపారు. యాక్షన్ సన్నివేశాల్లో నటించాలనే తన కోరిక ఈ చిత్రం ద్వారా తీరనుందని చెప్పారు. మాటల రచయిత దాసం వెంకట్రావ్ మాట్లాడుతూ, యూత్, క్లాస్ ను కూడా ఆకట్టుకునే పక్కా మాస్ చిత్రమిదని అన్నారు. ఆద్యంతం సస్పెన్స్ ఉంటుందన్నారు. అర్చన పాత్ర రఫ్ అండ్ టఫ్ గా ఉంటుందనీ, నాజర్, తెలంగాణ శకుంతల పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారు. గీత రచయిత సూరిశెట్టి రామారావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో భానుప్రియ, చంద్రమోహన్, కొండవలస, సుమన్ శెట్టి, రామిరెడ్డి, ప్రత్యేక పాత్రలో థ్రిల్లర్ మంజు నటించనున్నారు. అడుసుమిల్లి విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ, థ్రిల్లర్ మంజు ఫైట్స్, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|