'ఆకాశమంత' విజయం
ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా రాధా మోహన్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన 'ఆకాశమంత' చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటోందని చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన సక్సెస్ మీట్ లో ప్రకాష్ రాజ్, దిల్ రాజు, రాధామోహన్, విద్యాసాగర్, జె.కె.భారవి, ఇందిర పరిమి, శిరీష్-లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
జె.కె.భారవి మాట్లాడుతూ, ఈ చిత్రంలోని ప్రకాష్ రాజ్ పాత్రతో తనను తాను పోల్చి చూసుకున్నాననీ, సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చూపించిన సంఘటనలతో వ్యక్తిగతంగా తమను తాము పోల్చుకుంటారనీ అన్నారు. తల్లిదండ్రులు ఎలా ఉండాలనేది ఈ చిత్రంలో చెప్పారనీ, దర్శకుడు చక్కటి స్క్రీన్ ప్లే పనితనం చూపారనీ ప్రశంసించారు. వినోదం, భావోద్వేగాలు, ఎడ్యుకేషన్ కలగలిసిన చక్కటి సినిమా ఇదని మరో అతిథి ఇందిర పరిమి (సాక్షి) అభివర్ణించారు. బాక్సాఫీస్ వద్ద ఇదో పెద్ద సినిమా అవుతుందని ఆమె అన్నారు. సంగీత దర్శకుడు విద్యాసాగర్ మాట్లాడుతూ, తనకూ, ప్రకాష్ రాజ్ కూ, రాధామోహన్ కూ మధ్య పదేళ్లుగా మంచి స్నేహం ఉందనీ, తండ్రీకూతురి మధ్య అనుబంధాన్ని ఈ చిత్రంలో దర్శకుడు ఎంతో చక్కగా తెరకెక్కించారనీ అన్నారు. ఓ ఆడపిల్ల తండ్రిగా తనకు ఈ చిత్రం బాగా నచ్చిందని అన్నారు. సినిమా పట్ల ఎంతో అభిరుచి ఉన్న నిర్మాత దిల్ రాజనీ, తెలుగు వెర్షన్ కోసం మరో రెండు ట్యూన్స్ సినిమాలో చేర్చారనీ చెప్పారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, మానవ సంబంధాలపై సినిమాలు తీయడమంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. చాలాకాలంగా దిల్ రాజు, రాధామోహన్ లతో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని అన్నారు. దిల్ సినిమాలో నటించినప్పటి నుంచి తనను దిల్ రాజు అన్నయ్యా అని పిలుస్తుంటారనీ, ఆయన కేవలం నిర్మాతే కాదనీ, తనకు మంచి మిత్రుడనీ అన్నారు. ఇక విద్యాసాగర్ తో తనకు పధ్నాలుగేళ్ల పరిచయం ఉందనీ చెప్పారు. సంగీతం పట్ల ఎంతో కమాండ్ ఉన్న వ్యక్తి విద్యాసాగర్ అని అన్నారు. తాము ఏ లక్ష్యాన్ని ఆశించి సినిమా తీశామో అది నెరవేరిందని పేర్కొన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, తన బ్యానర్ లో ఇది 8వ సినిమా కావడం, సంఖ్యాశాస్త్ర ప్రకారం 8వ సంఖ్య డేంజర్ కావడంతో కొద్దిగా టెన్షన్ పడ్డాననీ, అయితే సినిమాకు మంచి ఆదరణ లభిస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ చెప్పారు. ఏలూరు వంటి సెంటర్లలో మొదటి రోజు ఆరు ఆటలు ప్రదర్శించారని తెలిపారు. చిన్న సినిమా అయినా పెద్ద విజయం దిశగా 'ఆకాశమంత' చిత్రం దూసుకు వెళ్తోందని అన్నారు.
Be first to comment on this News / Article!
|