వెంకీ, చరణ్ లతో ఏలేటి
ఎప్పుడూ కొత్తదనం కోరుకునే క్రియేటివ్ దర్శకులలో చంద్రశేఖర్ ఏలేటి ఒకరు. 'ఐతే', 'అనుకోకుండా ఒకరోజు', 'ఒక్కడున్నాడు' వంటి విభిన్న తరహా చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. 'ఒక్కడున్నాడు' తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న ఏలేటి ఇప్పుడు మంచు మనోజ్ కుమార్ హీరోగా 'ప్రయాణం' అనే రొమాంటిక్ థ్రిల్లర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం కోసం మలేసియాలో ఎక్కువ భాగం షూటింగ్ జరిపిన ఏలేటి ఇక నుంచి ఎక్కువ గ్యాప్ లేకుండానే వరుస చిత్రాలకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన స్క్రిప్టును కూడా ఆయన రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి వస్తే ఒక అగ్రహీరోతో ఏలేటి కలిసి పనిచేయడం ఇదే ప్రథమమవుతుంది.
నిన్నటి 'చిరుత', నేటి 'మగధీర' రామ్ చరణ్ తో కూడా ఓ చిత్రాన్ని తీయాలనే ఆలోచనలో ఏలేటి ఉన్నారు. ఇందుకు సంబంధించి ఒక యూత్ ఫుల్ కథాంశాన్ని ఆయన రెడీ చేస్తున్నారు. వీటికితోడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ఇంకో చిత్రాన్ని ఆయన ప్లాన్ చేస్తున్నారు. 'పల్లకిలో పెళ్లికూతురు' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన గౌతమ్ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి బ్రేక్ తనకు ఏలేటి చిత్రంతో లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. 'ప్రయాణం' తర్వాత ఏలేటి తదుపరి చిత్రం గౌతమ్ హీరోగానే ఉండచ్చని తెలుస్తోంది. త్వరలోనే తన తదుపరి ప్రాజెక్ట్ లకు చెందిన వివరాలను ఏలేటి ప్రకటించనున్నారు.
Be first to comment on this News / Article!
|