'కొమురం పులి' ఆగస్టులో
ఏడాదికి ఒక సినిమాకి మాత్రమే పరిమితమవుతున్న హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్న సందర్భాలు కూడా కనిపిస్తాయి. అయితే ఆయన నటించిన కొత్త సినిమా వస్తోందంటే మొదలయ్యే సందడి మాత్రం ఇంతాఅంతా కాదు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని కొరత తీరుస్తూ గత ఏడాది ఏప్రిల్ 3న విడుదలైన 'జల్సా ' చిత్రం మళ్లీ పవన్ కు ఉన్న ఇమేజ్ ను చాటిచెప్పింది. దీంతో సహజంగానే ఆయన తదుపరి చిత్రంపై అంచనాలు ఎక్కువయ్యాయి. అందుకు తగ్గట్టుగా పవన్ తో ఒకప్పుడు 'ఖుషీ' వంటి సెన్సేషన్ హిట్ ను ఇచ్చిన ఎస్.జె.సూర్య కాంబినేషన్ లో 'కొమురం పులి' చిత్రం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. కనక రత్న మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సింగనమల రమేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇంతవరకూ 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ కూడా జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ నెలాఖరు నుంచి మొదలవుతుందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.
పవన్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారనీ, ఏప్రిల్ 16, 23 తేదీల్లో రెండు విడతలుగా జరిగే ఎన్నికల పోలింగ్ అనంతరం ఆయన తిరిగి షూటింగ్ లో పాల్గొంటారనీ వారు తెలిపారు. పవన్ వెసులుబాటును బట్టి షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి, ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శకనిర్మాతలు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ చిత్రంలో పవన్ కు జోడిగా నిక్కి షా పటేల్ పరిచయమవుతుండగా, మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, శరణ్య, నాజర్, ఆలీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|