'మల్లన్న' ట్రైలర్స్ రిలీజ్
విక్రమ్, శ్రియ జంటగా సుశీ గణేషన్ దర్శకత్వంలో కలైపులి థాను 40 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 'మల్లన్న' చిత్రం సమ్మర్ కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. విక్రమ్ కెరీర్ లోనే అత్యంత లావిష్ గా రెండేళ్లకు పైగా ఈ చిత్రం నిర్మాణం జరుపుకోవడం విశేషం. తెలుగులో 'మల్లన్న' పేరుతోనూ, తమిళంలో 'కందస్వామి' పేరుతోనూ రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, స్పానిష్, ఇటాలియన్ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు నిర్మాత థాను సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్ తొలిసారిగా ఈ చిత్రం కోసం అన్ని పాటలు స్వయంగా పాడటం ఓ విశేషం కాగా, యువ సంగీత తరంగం దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈనెల 15న చెన్నైలో భారీ స్థాయిలో ఈ చిత్రం ఆడియో విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇటలీ నుంచి రప్పించిన డైన్సర్లతో ప్రస్తుతం రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ ను సన్ టీవీ రిలే చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఐదు ట్రైలర్స్ ను మంగళవారం రాత్రి శ్రీ అన్నై అభిరామి థియేటర్ లో కలైపులి థాను రిలీజ్ చేశారు. విక్రమ్, శ్రియ, దేవీశ్రీప్రసాద్, సుశీ గణేషన్, గేయరచయిత వివేక, సోనీ బిఎంజి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
థాను మాట్లాడుతూ, విక్రమ్ కథానాయకుడుగా నటించడంతో పాటు అన్ని పాటలకూ ఆయనే నేపథ్యగానం అందించడం విశేషమనీ, ఒకప్పటి నటులు తమ పాత్రలకు తామే పాటలు పాడుకునే వారనీ, ఈ చిత్రం ఆడియో క్రెడిట్ విక్రమ్ కే దక్కుతుందనీ అన్నారు. ఈనెల 15న గ్రాండ్ స్కేల్ లో ఆడియో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. 'కందస్వామి' (మల్లన్న) యూనిట్ తమిళనాడులోని 30 గ్రామాలను దత్తత చేసుకుని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేయనుందనీ, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామనీ అన్నారు. ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాత థాను తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని సుశీ గణేషన్ తెలిపారు. విక్రమ్ మాట్లాడుతూ, స్క్రిప్టు విన్నప్పుడు ఇంత పెద్ద సినిమా అవుతుందని తాను ఊహించలేదనీ, సుశీగణేషన్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని మలిచారనీ చెప్పారు. ఈ సినిమాలో తాను చాలా అందంగా కనిపించినట్టు చెబుతున్నారనీ, నా గత సినిమాల కన్నా ఇందులో ఏమాత్రం ఎక్కువ అందంగా కనిపించినా ఆ గొప్పతనం దర్శకుడు సుశీ గణేషన్ కే దక్కుతుందనీ శ్రియ అన్నారు. ఐపిఎల్ క్రికెట్ సీజన్ మే 24తో పూర్తి కానున్న నేపథ్యంలో మే 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కృష్ణ, ఆశిష్ విద్యార్థి, ఇంద్రజిత్ సుకుమారన్, ప్రభు గణేషన్, వివేక్ తదితరులు నటిస్తున్నారు. ఎన్.కె.ఏకాంబరం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|