'పోలీస్ పోలీస్' పెద్దలకే...
శ్రీరామ్, పృధ్వీరాజ్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులుగా మన్ మోహన్ దర్శకత్వంలో చందు నిర్మించిన 'పోలీస్ పోలీస్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుంది. ఈ చిత్రానికి ఒక్క కట్ కూడా లేకుండా 'ఎ' సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. తమిళ వెర్షన్ హక్కులను సన్ పిక్చర్స్ సంస్థ తీసుకుంది. ప్రస్తుతం తమిళ వెర్షన్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈనెల 15న తొలికాపీ సిద్ధమవుతుంది. అనంతరం రెండు భాషల్లోనూ ఏకకాలంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటూ నేరాలు చేసేవాళ్లను శిక్షించడమే పోలీసుల బాధ్యతనీ, అయితే పలువురు పోలీస్ ఆఫీసర్లు చూడ్డానికి పెద్ద మనుషులుగా కనిపిస్తుంటారనీ, వాళ్ల వెనుక ఉన్న చరిత్ర ఎవరికీ తెలియదనీ, అలాంటి ఓ వ్యక్తి గురించి సినిమాలో చర్చించడం జరిగిందనీ దర్శకుడు మన్ మోహన్ తెలిపారు. పత్రికల్లో వచ్చిన రియల్ లైఫ్ సంఘటనల స్ఫూర్తితో ఈ కథ తయారు చేశామనీ, గతంలో పోలీసు చిత్రాలు చాలా వచ్చినప్పటికీ అందుకు భిన్నంగా ఇది పూర్తి స్థాయి పోలీస్ ఫిల్మ్ గా రూపొందిందనీ చెప్పారు. పోలీసు అధికారుల పాత్రల్లో శ్రీరామ్, పృధ్వీరాజ్ ఎంతో హోమ్ వర్క్ చేశారనీ, బాడీ లాంగ్వేజ్, డ్రెస్ సెన్స్, వాయిస్..ఇలా ప్రతీ విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నారనీ పేర్కొన్నారు. పృధ్వీరాజ్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించినట్టు తెలిపారు. శ్రీరామ్ కూ, ఆయనకూ మధ్య జరిగే ఘర్షణ ఎంతో ఆసక్తి కలిగిస్తుందనీ అన్నారు. అలాగే కమలిని ముఖర్జీ కూడా తన పాత్రకు న్యాయం చేసిందని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం తమకుందనీ, ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|