'రాజు-మహారాజు'కు తెర
విలక్షణ నటుడు ఎం.మోహన్ బాబు, యువహీరో శర్వానంద్ కలిసి నటిస్తున్న చిత్రం 'రాజు మహారాజు'. సుర్విన్ చావ్లా, తషు కౌశిక హీరోయిన్లు. మోహన్ బాబుకు జంటగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. భానుశంకర్ దర్శకత్వంలో పత్తికొండ కుమార స్వామి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారంతో పూర్తయింది. రమ్యకృష్ణ, శర్వానంద్, తషు కౌశిక్ లపై సారథి స్టూడియోస్ లో చివరి పాటను చిత్రీకరించడంతో షూటింగ్ ముగిసింది. లొకేషన్ లో చిత్రయూనిట్ ఆ విశేషాలను తెలియజేసింది.
తొలుత మోహన్ బాబు మాట్లాడుతూ, చాలామంది నిర్మాతలు చెప్పేదొకటి, చేసేది ఇంకొకటి అన్నట్టుగా ఉంటారనీ, అయితే కుమారస్వామి చెప్పిన విధంగానే సినిమాను తీర్చిదిద్దడం ముచ్చట గొలుపుతోందనీ ప్రశంసించారు. శర్వానంద్ కు అన్నయ్యగా ఓ మంచి పాత్రను ఇందులో పోషిస్తున్నట్టు చెప్పారు. కథ నచ్చి సినిమా తీసిన్టటు నిర్మాత కుమారస్వామి తెలిపారు. మోహన్ బాబు, శర్వానంద్ తదితరులంతా ఎంతగానో సహకరించారనీ, ఒక్క సినిమాతోనే తనకు ఇంత గుర్తింపురావడానికి మోహన్ బాబు ఈ చిత్రంలో నటించడమే కారణమనీ అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి మేలో సినిమా విడుదల చేస్తామని చెప్పారు. మోహన్ బాబు, రమ్యకృష్ణ, శర్వానంద్ కాంబినేషన్ లో పనిచేడం ఎంతో సంతృప్తి నిచ్చిందనీ, ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాగా భావించి పనిచేశారనీ దర్శకుడు భానుశంకర్ పేర్కొన్నారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ, తాను, మోహన్ బాబు కలిసి ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించామనీ, మళ్లీ కలిసి నటిస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముందనీ అన్నారు. మోహన్ బాబుతో కలిసి నటించడం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగానని శర్వానంద్ పేర్కొన్నారు. తషు కౌషిక్, నృత్య దర్శకుడు తరుణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, చంద్రమోహన్, ధర్మవరపు, ఎల్బీ శ్రీరాం, రఘుబాబు, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, విజయకుమార్, ఎం.ఎస్.నారాయణ, సుధ, సురేఖావాణి తదితరులు నటించారు. జీవన సత్యం మాటలు, రమేష్ సినిమాటోగ్రఫీ, కోటగిరి ఎడిటింగ్, చక్రి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|