బెండు అప్పారావు ఆర్ఎంపి
సుబ్బారావు...తర్వాత జనాల్లో పాపులర్ పేరు అప్పారావు. రాజేంద్ర ప్రసాద్ ఆమధ్య 'అప్పుల అప్పారావు' అవతారం ఎత్తితే, ఆ సినిమా సృష్టికర్త అయిన ఇవివి సత్యనారాయణ ఇప్పుడు తన కుమారుడు అల్లరి నరేష్ ను 'బెండు అప్పారావు ఆర్ఎంపి'గా ప్రెజెంట్ చేయబోతున్నారు. కాస్త వంగి నడిచే వాళ్లను తమాషాగా బెండు అప్పారావు అని పిలుస్తుంటారు. సినిమాలో నరేష్ కు కూడా అలాంటిదేదో ఉండే ఉండొచ్చని అనుకోవాలి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించబోతున్నారు.
అల్లరి నరేష్ తో చాలాకాలంగా ఓ సినిమా చేయాలనుకుంటున్న రామానాయుడు ఎట్టకేలకు అతన్ని హీరోగా తీసుకుని ఇవివికి దర్శకత్వ పగ్గాలు అప్పగించారు. తొలుత బి.జయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరి నిమిషంలో మార్పు చోటుచేసుకుంది. ఇవివి సత్యనారాయణకు గతంలో ఇదే బ్యానర్ లో 'ప్రేమఖైదీ'తో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ఇవివి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం ఇవివి మరోసారి సురేష్ బ్యానర్ లో ఓ పెద్ద హిట్ ను ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. ఇటీవల అల్లరి నరేష్ తో ఆయన తీసిన 'ఫిట్టింగ్ మాస్టర్' చిత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. సందేశాలు, ప్రయోగాల జోలికి వెళ్లడమే ఇందుకు కారణం. ఈసారి ఇవివి ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లబోవడం లేదు. ఇందుకు తగ్గట్టుగానే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జనార్దన్ మహర్షి శిష్యుడైన గిరి చేత 'బెండు అప్పారావు' కథ రాయించారు. వెలిగొండతో సంభాషణలు రాయిస్తున్నారు. ఈ చిత్రానికి సంబధించిన మరిన్న వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Be first to comment on this News / Article!
|