'మిత్రుడు' పాటలు 4న
యువరత్న బాలకృష్ణ, గ్లామర్ నటి ప్రియమణి జంటగా వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మిత్రుడు'. ఎస్.ఎస్.రాజమౌళి శిష్యుడు మహాదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒక పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోను ఈనెల 4న లహరి మ్యూజిక్ ద్వారా నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు. తొలుత ఈనెల 2న ఆడియో విడుదలవుతుందని అనుకున్నప్పటికీ ఆ తదుపరి 4వ తేదీని ఖరారు చేశారు.
బాలకృష్ణ, మణిశర్మ కాంబినేషన్ లో గతంలో పలు మ్యూజికల్ హిట్లు వచ్చాయనీ, ఈ చిత్రం ఆడియో కూడా తప్పనిసరిగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉందనీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని చెప్పారు. కేవలం ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉందనీ, అతి త్వరలోనే ఆ పాటను చిత్రీకరించనున్నామని తెలిపారు. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమంలో భాగంగా డబ్బింగ్ పూర్తి చేశామనీ, రీరికార్డింగ్ కూడా పూర్తి స్వింగ్ లో ఉందనీ చెప్పారు. బాలకృష్ణ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా ఈ చిత్రం నిలిచిపోతుందనీ, హైద్రాబాద్ తో పాటు మలేసియాలో కూడా ఈ చిత్రం షూటింగ్ జరిపామనీ తెలిపారు. విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథకు ఎం.రత్నం చక్కటి సంభాషణలు సమకూర్చారని చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరుకు సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, ధర్మవరపు, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, బాలయ్య, జయప్రకాష్ రెడ్డి, హేమ, ఝాన్సీ తదితరులు నటించారు.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|