'మిత్రుడు' వీడియో చౌర్యం
భారీ అంచనాలున్న సినిమాల వీడియో క్లిప్లింగ్స్ ఈమధ్య తరచు చౌర్యానికి గురవుతున్నాయి. రజనీకాంత్ 'శివాజీ', పవన్ కల్యాణ్ 'జల్సా'...త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ చరణ్ 'మగధీర' లోని పాట ఇప్పటికే 'నెట్స్'లోకి చొరబడిపోతున్నాయి. ఎడిటింగ్ టేబుల్ వద్దే ఇలాంటి గల్లంతు పనులు జరుగుతున్నాయని నిర్మాతలు వాపోవడం మినహా పటిష్ఠమైన చర్యలేవీ ఇప్పటి వరకూ తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఇప్పుడు తొలిసారిగా బాలకృష్ణ చిత్రానికి కూడా వీడియో చౌర్యం తప్పలేదు. బాలకృష్ణ కథానాయకుడుగా ఆయన ఫేవరెట్ నిర్మాత కృష్ణ ప్రసాద్ భారీ అంచనాలతో 'మిత్రుడు' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంలోని ఓ పాటకు సంబంధించిన వీడియో యూబ్యూట్ లో దర్శనమిస్తోంది. నిజానికి నెట్ సర్ఫింగ్ చేసే వాళ్లకే ఇది తెలిసే అవకాశాలుంటాయి. ఇప్పుడు పెరుగుతున్న ఛానెళ్లు, వాటి మధ్య పోటీ పుణ్యమా అని ఈ లీకేజీ పాటకు సంబంధించి ఓ ఛానెల్ ఎకాఎకిన ఓ వార్త వండేసి...సదరు పాటను కూడా ప్రసారం చేసేయడంతో ఒక్కసారిగా 'మిత్రుడు' సాంగ్ జనాల్లోకి కూడా వెళ్లిపోయింది. షాక్ తినడం నిర్మాత వంతైంది.
అసలు ఆడియో క్లిప్పింగ్స్ ఎలా బయటకు వచ్చాయనేది అంతుబట్టకుండా ఉందనీ, ఎడిటింగ్ టేబుల్ వద్ద పొరపాటు జరిగే అవకాశాన్ని పరిశీలిస్తున్నామనీ నిర్మాత ఆవేదనగా చెబుతున్నారు. కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీస్తుంటే ట్రైలర్స్ రిలీజ్ కు ముందే, కనీసం ఆడియో విడుదల కూడా జరక్కుండానే జనంలోకి సినిమా వెళ్లడం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసు కంప్లయిట్ ఇచ్చారని సమాచారం. ఇంటర్నెట్ బ్రౌజర్లకు మాత్రమే ఇలాంటి క్లిప్పింగ్ ల వ్యవహారం తెలియడం వల్ల అందరికీ రీచ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయనీ. సెన్సేషన్ కోసం ఛానెల్స్ వాటిని డౌన్ లోడ్ చేసి ప్రసారం చేయడం మాత్రం ఇదే ప్రథమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Be first to comment on this News / Article!
|