'బొమ్మాలీ నిన్ను వదలా' అంటూ తన గంభీరమైన వాయిస్ తో 'అరుంధతి' చిత్రంలో సోనూసూద్ కు డబ్బింగ్ చేసిన రవిశంకర్ ను ప్రేక్షకులు అంత తేలిగ్గా మరిచిపోలేరు. వాయిస్ కింగ్ సాయికుమార్ సోదరుడైన రవిశంకర్ ఇప్పటికే 5 సార్లు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డులు అందుకున్నారు. హిందీ నుంచి వచ్చిన సాయాజీ షిండే, ప్రదీప్ రావత్ వంటి విలనీ పాత్రధారులందరికీ దాదాపు ఆయనే డబ్బింగ్ చెప్పారు. అయితే 'అరుంధతి' చిత్రం సాధించిన విజయంతో రవిశంకర్ కు చక్కటి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రానికి గాను ఆయన ఆరోసారి నంది అవార్డును అందుకోవడం కూడా ఖాయమనే చెప్పొచ్చు. 'బొమ్మాలీ నిన్ను వదల' అనే డైలాగ్ ఎంతగా పాపులర్ అయిందంటే ఆ లైన్ ను శుక్రవారం విడుదలైన 'బిల్లా' చిత్రంలోని ఓ సాంగ్ లో వాడుకున్నారు. కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా అడపాదడపా సినిమాల్లో చిన్నా చితకా పాత్రలను కూడా రవిశంకర్ పోషిస్తూ వచ్చారు. తాజాగా 'అరుంధతి' తర్వాత మళ్లీ ఆయనకు నటుడిగా ఆఫర్లు వస్తున్నాయి. వరుణ్ సందేశ్ హీరోగా ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్ లో రూపొందుతున్న చిత్రంలో రవిశంకర్ విలన్ పాత్ర పోషించబోతున్నారు.
తమిళంలో ధనుష్ హీరోగా విజయవంతమైన 'పొల్లధావన్' చిత్రానికి రీమేక్ గా ఆనంది ఆర్ట్స్ చిత్రం ఉండబోతోంది. ఇందులో విలనీ రోల్ సైతం పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇంతవరకూ విలన్లకు డబ్బింగ్ చెబుతూ వచ్చిన రవిశంకర్ నేరుగా పవర్ ఫుల్ విలనీ పోషించనుండటంతో నటుడిగా ఆయనకు సరైన బ్రేక్ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి.