ఇండస్ట్రీ బాగోగులు గురించి మాట్లాడటంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎప్పటికప్పుడు ముందుంటారు. కార్మిక పక్షపాతిగానే కాకుండా పరిశ్రమలో ఏ అవసరం ఉన్నా తమ్మారెడ్డి ముందుకు వచ్చి తన భూజాలమీద వేసుకుంటారు. రాజకీయ నాయకులు ప్రచారాస్త్రాలుగా తారలను ఉపయోగించుకోవడంపై తమ్మారెడ్డి తాజాగా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు. ప్రచారానికి వెళ్లిన ఆర్టిస్టులకు ఏదైనా జరగరాదని జరిగితే వాళ్లమీదే ఆధారపడిన నిర్మాతలు ఏమి కావాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లి తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆర్టిస్టులు అసలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మేలనేది తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పుకొచ్చారు.
'రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా వచ్చే తాత్కాలిక ప్రయోజనాలను ఆర్టిస్టులు ఆశించడం సరైనది కాదు. ఈ రోజు చూస్తూనే ఉన్నాం. ఒకరి మీద మరొకరు బురద జల్లుకుంటున్నారు. ఇందు వల్ల ఆర్టిస్టులు చులకనై పోతారు. ఎవరు ఏ పార్టీ తరఫున ప్రచారం చేసినా మరొకరిని నిందిస్తున్న సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇప్పుడు తిట్టుకున్నా రేపు మళ్లీ పరిశ్రమలో ముఖముఖాలు చూసుకుని కలిసి పనిచేయాల్సి వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా వాళ్లను పొల్టీషియన్లు పావుల్లా వాడుకోవడం కనిపిస్తుంది. అవసరం తీరిన తర్వాత కరివేపాకులా పక్కన పెట్టేస్తారు' అని తమ్మారెడ్డి హితవు పలికారు. అయితే ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు పార్టీల పరంగా ప్రచారం బరిలోకి దిగడంతో పాటు మరికొందరు టిక్కెట్లు కూడా జేక్కించుకున్నారు. మంచి మాటలకు ముందు వెనుకలతో పని లేదు కాబట్టి తమ్మారెడ్డి సలహాలను పాజిటివ్ గానే తీసుకోవచ్చు.