'మేస్త్రి' వచ్చాడు...'అధినేత' రాబోతున్నాడు. మరి 'బంగారు బాబు' ఆచూకీ మాత్రం చిక్కడం లేదు. ఈ మూడు సినిమాలకు లింకు ఏమిటనేదాగా అసలు ప్రశ్న. నిశ్చయంగా ఉంది. దర్శకరత్న దాసరి నారాయణరావు సతీమణి దాసరి పద్మ సమర్పణలో రాజకీయ నేపథ్యంలో 'మేస్త్రి' చిత్రం రూపొంది ప్రేక్షకుల ముందుకు ఈమధ్యనే వచ్చిది. 'బంగారుబాబు' సైతం దాసరి పద్మ సమర్పణలోనే రూపొందింది. 'అధినేత' చిత్రం వేరే బ్యానర్ పై రూపొందుతున్నప్పటికీ అందులోనూ జగపతిబాబు హీరో కావడం వల్లనే ఈ పోలిక అనివార్యమవుతోంది.
జగపతిబాబు, మీరాజాస్మిన్ జంటగా సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై కె.రామకృష్ణ ప్రసాద్ 'బంగారు బాబు' చిత్రాన్ని నిర్మించారు. ఆమధ్య కాశ్మీర్ లో షూటింగ్ సందర్భంగా అక్కడ అల్లర్లు చెలరేగినప్పుడు దాసరి సమయస్ఫూర్తితో వ్యవహరించి యూనిట్ మొత్తాన్ని సేఫ్ గా హైద్రాబాద్ కు రప్పించగలిగారు. జగపతిబాబు సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. తీరా సినిమా నిర్మాణం పూర్తయి ఇప్పటికే చాలారోజులు అయినప్పటికీ విడుదలకు మాత్రం 'బంగారుబాబు' నోచుకోని పరిస్థితి నెలకొంది. నిజానికి ఇప్పటికే ఒకటి రెండుసార్లు రిలీజ్ తేదీలు అనుకున్నప్పటికీ ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చారు. ఈలోగా 'మేస్త్రి' రిలీజ్ అనుకోవడంతో దాసరి స్వయంగా నిర్మాత కె.రామకృష్ణ ప్రసాద్ ను ఒప్పించి మరో వాయిదా వేయించారని చెబుతారు. 'మేస్త్రి' అనుకున్నట్టుగానే విడుదలైంది. 'బంగారు బాబు' ఆచూకీ మాత్రం ఇంతవరకూ లేదు. జగపతిబాబు సైతం ఆ సినిమాపై ఆశ వదులుకున్నారేమోననే అభిప్రాయానికి కూడా ఇది తావిస్తోంది. ఎందుకంటే ఆయన నటిస్తున్న 'అధిపతి' కూడా ఈనెల 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు జగపతి రాజేంద్ర ప్రసాద్ బ్యానర్ కు 'బంగారు బాబు' ఎంతో మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ఆయన కుమారుడే 'బంగారుబాబు' అవాతారమెత్తినా విడుదలకు మీన మేషాలు లెక్కెట్టే పరిస్థితి. ఆలస్యం అమృతం విషం అనేది అందరికీ తెలిసిందే. వాయిదాలు పడిన సినిమాలను జనం తేలిగ్గా మరచిపోయి...ఆ తర్వాత విడుదలైనా రీరిలీజ్ కావచ్చనే అపోహ పడే ప్రమాదమూ ఉంటుంది. ఇప్పటికైనా నిర్మాతలు త్వరపడితే మంచిది...