నాగ..తాండవం!
వచ్చే శుక్రవారం బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోరు జరగనుంది. ఈ పోటీ అందాల భామ తమన్నాకూ, సెక్సీ బాంబ్ ముమైత్ కూ మధ్య ఉండబోతుండమే ఆ విశేషం. ముమైత్ 'పున్నమినాగు', తమన్నా 'ఆనంద తాండవం' చిత్రాలు ఈనెల 10న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ వారు మెయిన్ లీడ్స్ పోషించడంతో ఇద్దరికీ ఇవి ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ లు కాబోతున్నాయి. ఐటెం గాళ్ గా సంచలనం సృష్టించి ఎకాఎకిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు మళ్లిన ముమైత్ 'మైసమ్మ ఐపిఎస్', 'మంగతాయారు టిఫిన్ సెంటర్' చిత్రాల్లో టైటిల్ రోల్స్ పోషించింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూశాయి. ఈ క్రమంలో ముమైత్ కథానాయికగా 'పున్నమినాగు' చిత్రాన్ని సీనియర్ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. ఇది బాలీవుడ్ 'నాగిన్' తరహా థ్రిల్లర్ మూవీగా ఉండబోతోంది. దీనికితోడు ఇదే టైటిల్ తో గతంలో కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన 'పున్నమినాగు' చిత్రం మంచి హిట్ కావడంతో సహజంగానే ముమైత్ సినిమాపై అంచనాలున్నాయి. ఆనాటి చిత్రంలో మ్యూజికల్ హిట్ సాంగ్ అయిన 'రగులుతోంది మెగలిపొద' పాటను ఇప్పటి సినిమాలో ముమైత్, రాజీవ్ కనకాలపై చిత్రీకరించడం ఈ సినిమాలోని మరో విశేషం.
తమన్నా ప్రధాన పాత్ర పోషించిన 'ఆనంద తాండవం' చిత్రంపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల 'దశావతారం' వంటి సెన్సేషన్ హిట్ ను అందించిన భారీ నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్ ఈ చిత్రాన్ని గాంధీ కృష్ణ దర్శకత్వంలో నిర్మించింది. ఫారెన్ లొకేషన్లలో రిచ్ గా సినిమా తీశారు. ఇవాల్టి జనరేషన్ ను ఒప్పించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఒకేరోజు విడుదలవుతున్న 'పున్నమినాగు', 'ఆనంద తాండవం' చిత్రాల్లో ఎవరికి పైచేయి అవుతుందనేది వచ్చే శుక్రవారం తేలుతుంది. అన్నట్టు...జగపతిబాబు పొలిటికల్ ఫిల్మ్ 'అధినేత' సైతం ఇదే శుక్రవారంపైనే కన్నేసింది.
Be first to comment on this News / Article!
|