ప్రియమణి ఇప్పుడు లేటెస్ట్ హాట్ బ్రాండ్ అనిపించుకుంటోంది. తమిళంలో మేకప్ లేకుండా నటించి జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డును అందుకున్న ప్రియమణి తన గ్లామర్ ఇమేజ్ ను కాపాడుకుంటూ 'ద్రోణ' చిత్రంలో బికినీతో కనిపించి ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపించింది. ప్రస్తుతం బాలకృష్ణతో నటిస్తున్న 'మిత్రుడు' చిత్రంలోనూ ప్రియమణి గ్లామర్ కు పెద్దపీటే వేసి రెయినీ సాంగ్ లో నటించింది. మణిరత్నం ద్విభాషా చిత్రం 'రావణ'లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా తెలుగులో మరో చిత్రాన్ని ఒప్పుకుంది. అదికూడా తెలుగులో తనకు మంచి బ్రేక్ ఇచ్చిన 'పెళ్లయిన కొత్తలో' టీమ్ తో కావడం విశేషం.
'ఎవరే అతగాడు' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన ప్రియమణి ఆ తర్వాత జగపతిబాబుతో మదన్ దర్శకత్వంలో రూపొందిన 'పెళ్లైన కొత్తలో' చిత్రంతో మంచి బ్రేక్ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ జగపతిబాబు కాంబినేషన్ లోనే మదన్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో ప్రియమణి కథానాయికగా ఎంపికైంది. దీనికి 'ప్రవరాఖ్యుడు' అనే టైటిల్ ను కన్ ఫర్మ్ చేశారు. ప్రవరాఖ్యుడు పేరు చెప్పగానే అల్లసాని పెద్దన్న విరచిత 'మను సంభవం' గుర్తుకువస్తుంది. బ్రాహ్మణ యువకుడైన ప్రవరుడిని దేవకన్న అయిన వరుంధతి ప్రేమిస్తుంది. అయితే ఆమె ప్రేమ ప్రతిపాదనను ప్రవరాఖ్యుడు తిరస్కరిస్తాడు. అమ్మాయిలకు దూరంగా ఉండేవాళ్లను ప్రవరాఖ్యుడు అని సరదాగా పిలుస్తుంటారు. మదన్ ఇదే కథను సోషలైజ్ చేసి రొమాంటిక్ గా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇందులో ప్రియమణి స్టూడెండ్ గా, జగపతిబాబు లెక్చరర్ గా నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అజయ్ హీరోగా 'ఆ ఒక్కడు' చిత్రాన్ని నిర్మిస్తున్న టాలీ 2 హాలీ బ్యానర్ ద్వితీయ చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిచనున్నారు. మేలో ఈ కొత్తచిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.