శ్రియ 'ముదురు' ప్రేమ!
తెలుగు సినిమాలతోనే నటిగా మంచి బ్రేక్ వచ్చినా ఇతర భాషా చిత్రాల్లోనే శ్రియ కొద్దికాలంగా బిజీ అవుతూ వచ్చింది. అయితే తెలుగులో అడపాదడపా స్పెషల్ సాంగ్ వంటివి చేస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. తమిళంలో 'మలై' ('వర్షం' రీమేక్) చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన శ్రియ ఆ తర్వాత ఎకాఎకిన 'శివాజీ' లో రజనీకాంత్ సరసన నటించి స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోతోంది. ఒవైపు రజనీతో నటిస్తూనే రజనీ అల్లుడు ధనుష్ తో 'తిరువిలయాడల్ ఆరంభం' సినిమాలోనూ జత కట్టేసింది. ఈవిధంగా ఆమె తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా ఈ అనువాద చిత్రాన్ని 'శీనుగాడు మహాముదురు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నారు. శ్రీ సౌదామిని క్రియేషన్ బ్యానర్ పై కె.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు.
తమిళంలో ధనుష్ కు మంచి మాస్ అప్పీల్ ఉంది. శ్రియకు గ్లామర్ క్లీన్ గా పేరుంది. ఈ ఇద్దరూ కలిసి నటించిన తమిళ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతమైందనీ, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం తనకుందనీ నిర్మాత తెలిపారు. ప్రేమ, వినోదం, యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. బిజినెస్ మాగ్నెట్ కావాలనుకునే ఓ యువకుడు తన ప్రియురాలి సాయంతో ఎలా తన కలను సాకారం చేసుకున్నాడనేది ఈ చిత్ర ఇతివృత్తమని అన్నారు. ఈనెల 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల మందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శరణ్య, మౌర్య తదితరులు నటించారు. ఇమ్మాన్ సంగీతం అందించగా, జి.భూపతి పాండ్యన్ దర్శకుడు.
Be first to comment on this News / Article!
|