'రోమియో' పాటలొచ్చాయి
ఆర్యన్ రాజేష్ కథానాయకుడుగా, శ్రీహరి కీలక పాత్రలో రూపొందుతున్న చిత్రం 'రోమియో'. సుధ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామకృష్ణ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని మాదపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగింది. శ్రీహరి ఆడియో సీడీని ఆవిష్కరించి ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.వి.వినాయక్ కు తొలి ప్రతిని అందజేశారు. అగస్త్య సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా విడుదలైంది.
శ్రీహరి మాట్లాడుతూ, ఈ చిత్రంలో తాను చాలా మంచి పాత్ర పోషించాననీ, ఆర్యన్ రాజేష్ తో కలిసి నటించిన తొలి చిత్రమిదనీ చెప్పారు. హీరోగా ఆర్యన్ కు ఈ చిత్రం మంచిపేరు తెస్తుందని అన్నారు. మరో అతిథి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, శ్రీహరితో తమ తొలిచిత్రాలు తీసిన నిర్మాతలంతా లాభపడి పరిశ్రమలో నిలదొక్కుకున్నారనీ, అందులో తాను కూడా ఉన్నాననీ అన్నారు. శ్రీనివాస్ కూడా నిర్మాతగా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. అగస్త్య సంగీతం అందించిన 'పెళ్లైన కొత్తలో' మంచి విజయం సాధించిందనీ, ఆయన ప్రతిభాపాటవాలు ఈ చిత్రంతో మరింత వెలుగులోకి వస్తాయని దర్శకుడు వి.ఎన్.ఆదిత్య పేర్కొన్నారు. ఈ చిత్రం కథ తనకు బాగా నచ్చిందనీ, యూనిట్ అందరికీ మంచిపేరు వస్తుందనీ సి.కల్యాణ్ అన్నారు. ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ, కొంత గ్యాప్ తరువాత మంచి కథాబలం ఉన్న చిత్రం చేద్దామని అనుకున్నప్పుడు ఈ కథ బాగా నచ్చి నటించాననీ, శ్రీహరితో కలిసి పనిచేయడం చాలా సంతోషాన్నిచ్చిందనీ చెప్పారు. దర్శకుడిగా తనకు ఇది తొలి చిత్రమే అయినా నిర్మాత సహకారంతో సినిమా బాగా తీయగలిగినట్టు రామకృష్ణ తెలిపారు. ఇందులోని ఐదు పాటలు ప్రేక్షకులను తప్పనిసరిగా అలరిస్తాయని అగస్త్య పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|