కమల్ 'ఈనాడు' మొదలైంది
'దశావతారం' చిత్ర విడుదలైన ఏడాది తర్వాత కమల్ హాసన్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. తొలుత తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మర్మయోగి'ని తెరకెక్కించాలని కమల్ అనుకున్నప్పటికీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆ చిత్రం వెనక్కి వెళ్లింది. ఈ క్రమంలో హిందీలో నసీరుద్దీన్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించగా విజయవంతమైన 'ఎ వెన్స్ డే' చిత్రం రీమేక్ హక్కులను కమల్ తీసుకున్నారు.
ఈ చిత్రానికి 'ఈనాడు' అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రాజ్ కమల్ పతాకంపై యూటీవీతో కలిసి కమల్ హాసన్ సొంతంగా నిర్మిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు.
'ఎ వెన్స్ డే' హక్కుల విషయం ఇటీవల వివాదాస్పదమైంది. ఈ చిత్రం రీమేక్ హక్కులను తాము తీసుకున్నట్టు తెలుగు నిర్మాత కోనేరు కిరణ్ కుమార్ ప్రకటించారు. అయితే రీమేక్ హక్కులు ఎవరికీ అమ్మలేదంటూ యూటీవీ సంస్థ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కమల్ ఈ చిత్రం హక్కులను అందిపుచ్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిని కిరణ్ కుమార్ కోర్టులో సవాలు చేశారు. రీమేక్ రైట్స్ కోసం అడ్వాన్ చెల్లించామంటూ ఆయన తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో కమల్ జోక్యం చేసుకుని ఇరువర్గాలను ఒప్పించి తనకు లైన్ క్లియర్ చేసుకున్నట్టు సమాచారం. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై 'ఈనాడు' అనే టైటిల్ ను రామోజీ రావు రిజిస్టర్ చేయించుకోవడంతో కమల్ ఆయనను కూడా ఒప్పించి ఆ టైటిల్ ను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో తోట తరణి కళా దర్శకత్వంలో ఓ భారీ సెట్ కూడా వేశారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రను పోషించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Be first to comment on this News / Article!
|