'రైడ్' లోగో ఆవిష్కరణ
ఇద్దరు స్నేహితుల కథతో రూపొందుతున్న చిత్రం 'రైడ్'. నాని ('అష్ట చమ్మ' ఫేమ్), తనీష్ (నచ్చావులే) హీరోలు. శ్వేతబసు ప్రసాద్ ('కొత్త బంగారులోకం' ఫేమ్) హీరోయిన్. రమేష్ వర్మ దర్శకత్వంలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ హైద్రాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ లో జరిగింది. ఇక్కడే వేసిన సెట్ లో తనీష్, శ్వేతాప్రసాద్ లపై ఓ పాటను అమ్మరాజశేఖర్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు.
బెల్లకొండ సురేష్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ, ఇంతవరకూ 80 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు. గాయకుడు హేమచంద్రను ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నామనీ, ఆయన అందించిన పాటలన్నీ సినిమాకి హైలైట్ అవుతాయని అన్నారు. ఓ పెద్ద హీరోతో త్వరలో చేయబోయే చిత్రానికి కూడా ఆయనే సంగీత దర్శకుడిగా ఉంటారని చెప్పారు. 'రైడ్ ' చిత్రం చాలా బాగా వస్తోందనీ, మే 9న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. 'అష్టాచమ్మ' చిత్రం తర్వాత తాను నటిస్తున్న రెండో సినిమా ఇదనీ, ఇది కూడా అంచనాలకు మించి విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందనీ నాన్ని తెలిపారు. 'నచ్చావులే' వంటి హిట్ తర్వాత తాను ఈ చిత్రంలో నటిస్తున్నాననీ, గతంలో ఇద్దరు స్నేహితుల కథతో వచ్చిన 'ప్రేమదేశం' హిట్టయినట్టే, స్నేహితుల కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం కూడా ప్రేక్షకాదరణ చూరగొంటుందని తనీష్ అన్నారు. తన తొలి సినిమా 'కొత్త బంగారులోకం' కంటే ఇది మరింత పెద్ద హిట్టవుతుందని శ్వేతబలు ప్రసాద్ తెలిపారు. సంగీత దర్శకుడిగా తనకు అవకాశం కలిపించిన దర్శకనిర్మాతలకు హేమచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారిగా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నాననీ, కథతో పాటు ఫోటోగ్రఫీ, సంగీతం హైలైట్స్ అవుతాయని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పలపాటి రవి తెలిపారు. ఈ సమావేశంలో రమేష్ వర్మ, అమ్మ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, కాశీ విశ్వనాథ్, తులసి, సుధ తదితరులు నటిస్తున్నారు. శశాంక్ వెన్నెల కంటి మాటలు, శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|