శిల్పాశెట్టి 'ముద్దుగుమ్మ'
బాలీవుడ్ ప్రముఖ నటి, బ్రిటిష్ 'బిగ్ బ్రదర్స్' రియాల్టీ షో విన్నర్ శిల్పా శెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. 'వీడెవడండి బాబు', 'ఆజాద్', 'మిస్టర్ రోమియో' (అనువాదం) చిత్రాల్లో శిల్పా నటించింది. తాజాగా ఆమె మరోసారి 'ముద్దుగుమ్మ'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందీలో ఆమె నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'ఖామోష్' ను 'ముద్దుగుమ్మ'గా అనువదిస్తున్నారు. నీనా క్రియేషన్స్ పతాకంపై కల్లె కరుణాకర్ సమర్పణలో ఎదురూరి అంజిబాబు ఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు. దీపక్ తిజోరి దర్శకుడు.
థ్రిల్లర్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తున్నారనీ, హిందీలో వచ్చిన 'ఖామోష్' ప్రేక్షకాదరణ చూరగొనడంతో దానిని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామనీ నిర్మాతలు తెలిపారు. ఒక వర్షం కురిసిన రాత్రి హోటల్ లో బసచేసిన కొందరు వరుసగా హత్యకు గురవుతుంటారనీ, హంతకులెవరనేది చివరి వరకూ తెలియకుండా సస్పెన్స్ తో కథ నడుస్తుందనీ తెలిపారు. ఈ చిత్రంలో శిల్పా పబ్ సాంగ్ ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, మేలో సినిమా విడుదల చేస్తామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో షవర్ అలీ రాజీవ్ సింగ్, రాఖీ సావంత్, జూహీచావ్లా, కెల్లీడోర్జ్, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|