ఓటరూ...జర జాగ్రత్త!
'మళ్లీ ఎన్నికలొచ్చాయి. ఒక పూట కడుపు నిండుతుందని నోటుకు అమ్ముడుపోతే ఐదేళ్లు పాటు చింతించాల్సి వచ్చింది. ఓటరూ...జర జాగ్రత్త' అని ప్రముఖ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు పిలుపునిచ్చారు. నటుడుగా 520కి పైగా చిత్రాల్లో నటించి, రాజ్యసభ ఎం.పి.గా రాజకీయ అనుభవాన్ని కూడా సొంతం చేసుకున్న ఆయన ఈ ఎన్నికల సీజన్ లో పెదవి విప్పడం ఇదే తొలిసారి. దర్శకరత్న దాసరి నారాయణరావు టైటిల్ పాత్ర పోషించిన 'మేస్త్రి' చిత్రం సక్సెస్ మీట్ బుధవారంనాడు దాసరి నివాసంలో జరిగింది. ఇందులో దళితుడిగా ఓ ముఖ్యపాత్ర పోషించిన మోహన్ బాబు సైతం పాల్గొని మాట్లాడారు.
రాజకీయాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావన వచ్చినప్పుడు మోహన్ బాబు స్పందిస్తూ, ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని వివరణ ఇచ్చారు. మనలోని ఆత్మ, అంతరాత్మ, పరమాత్మను గుర్తెరిగి అంతరాత్మ ప్రబోధం మేరకు మంచివాళ్లను రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. కొన్ని పార్టీలు అంతా ఉచితమేనని చెబుతుంటే, మరికొందరు కోట్ల రూపాలయకు టిక్కెట్లు అమ్ముకోవడం శోచనీయమని అన్నారు. కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్లు దానిని రాబట్టుకోవడానికి అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుందని అన్నారు. తాను వేషాల కోసం చెన్నై వెళ్లినప్పుడు 40 గంటల పాటు తిండిలేకుండా కేవలం మంచినీళ్లు తాగి ఉన్నాననీ, ఆ కష్టాలు తనకు తెలుసుననీ అన్నారు. కేవలం ఒక పూట కడుపు నింపుకోవడం కోసం 100, 200 రూపాయల కోసం కక్కూర్తి పడి ఓటును అమ్ముకోవద్దని ఆయన ప్రజలను కోరారు. 'ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. నోటుకో, సారాయికో ఓటును అమ్ముకోవద్దు. మంచి వాళ్లకే ఓటేయండి. పార్టీలు ఏవైనా కావచ్చు. మంచి వారిని ఎన్నుకోవడంలో మాత్రం మన విచక్షణ చూపించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి' అని మోహన్ బాబు పిలుపునిచ్చారు.
Be first to comment on this News / Article!
|