ఆస్ట్రేలియా వెళ్తున్న గోపీచంద్
'శౌర్యం' వంటి హిట్ తత్వాత మంచి ఊపులో ఉన్న హీరో గోపీచంద్, 'కింగ్' సక్సెస్ తర్వాత త్రిష ఇప్పుడు హాటెస్ట్ పెయిర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు. తొలిసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై ఓ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. శివ ('శౌర్యం' ఫేమ్) దర్శకత్వంలో జె.భగవాన్, జె.పుల్లరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 15 నుంచి చిత్రయూనిట్ ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్తోంది.
చిత్రం ప్రోగ్రస్ ను నిర్మాత భగవాన్ తెలియజేస్తూ, ఫిబ్రవరి 1 నుంచి ఈనెల 6 వరకూ హైద్రాబాద్ పరిసరాల్లోనూ, రామోజీ ఫిలింసిటీలోనూ షూటింగ్ జరిపామని చెప్పారు. ఈనెల 15 నుంచి ఆస్ట్రేలియాలో రెండు పాటలు, కొన్ని కీలక దృశ్యాలను మే 5 వరకూ చిత్రీకరిస్తామని చెప్పారు. మే 10 నుంచి జరిగే చివరి షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుందన్నారు. జూన్ లో ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నామని ఉన్నారు. గోపీచంద్-త్రిష తొలి కాంబినేషన్ కావడంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు మరో నిర్మాత పుల్లారావు తెలిపారు. ఆస్ట్రేలియాలో ఇంతవరకూ ఎవరూ షూటింగ్ చేయని లొకేషన్లు ఎంచుకుని రెండు పాటలు చిత్రీకరించనున్నట్టు చెప్పారు. అన్ని తరగతుల ప్రేక్షకులను అలరించే అంశాలతో దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను సత్యరాజ్ పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో చంద్రమోహన్, కోట, ధర్మవరపు ఆలీ, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎం.ఎస్.నారాయణ. ఎల్.బి.శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి మాటలు, వెట్రి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, విజయ్-సెల్వ-గణేష్-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, తమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|