నాగచైతన్య సినిమా జూలైలో
హీరో నాగార్జున తనయుడు నాగచైతన్యను కథానాయకుడుగా పరిచయం చేస్తూ వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోంది. ఈ చిత్రం 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు దిల్ రాజు ప్రకటించారు. తొలిసారి ఈ చిత్రం ప్రోగ్రస్ ను ఆయన శుక్రవారంనాడు 'ఆకాశమంత' సినిమా సక్సెస్ మీట్ లో తెలియజేశారు.
నాగచైతన్య తొలి చిత్రాన్ని తమ బ్యానర్ నుండి పరిచయం చేస్తుండటం చాలా సంతోషంగా ఉందనీ, వాసువర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 60 శాంత షూటింగ్ పూర్తి చేసుకుందనీ, మూడు పాటల చిత్రీకరణ కూడా పూర్తయిందనీ చెప్పారు. మేలో ఒక నెలరోజుల పాటు అమృత్ సర్ లో షూటింగ్ కు ప్లాన్ చేశామనీ, రెండు పాటలు జూలైలో చిత్రీకరిస్తామనీ చెప్పారు. జూలై నెలాఖరులకు సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు.
మరో 3 చిత్రాలు...
తమ బ్యానర్ నుంచి మరికొన్ని చిత్రాలు కూడా ఈ ఏడాదిలోనే ఉంటాయని తెలిపారు. వరుణ్ సందేష్ ('కొత్త బంగారులోకం' ఫేమ్) కథానాయకుడిగా లాంఛనంగా ప్రారంభించిన 'మరోచరిత్ర' చిత్రం మే 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటుందని దిల్ రాజు చెప్పారు. అలాగే హీరో ప్రభాస్ తో దశరథ్ ('సంతోషం' ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రం ప్లాన్ చేశామనీ, ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందనీ తెలిపారు. వీటికితోడు రామ్ ('రెడీ' ఫేమ్) హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా ఈ ఏడాదే ప్రారంభమవుతుందని చెప్పారు.
Be first to comment on this News / Article!
|