రెట్టింపు లాభాల 'ఆకాశమంత'
చిన్న సినిమాగా తాము తీసిన 'ఆకాశమంత' చిత్రం పెద్ద హిట్టయిందని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు తెలిపారు. ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన ఈచిత్రం విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుని మూడోవారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్బంగా శుక్రవారంనాడు సంస్థ కార్యాలయంలో దిల్ రాజు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
'ఆకాశమంత' చిత్రానికి పాజిటివ్ రెస్సాన్స్ వస్తుందని తాము అంచనా వేశామనీ, అయితే తమ అంచనాలకు మించి ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి 3వ వారంలోకి అడుగుపెట్టిందని దిల్ రాజు పేర్కొన్నారు. చిన్నచిత్రాల్లో మంచి కమర్షియల్ హిట్ గా ఈ చిత్రం నిలుస్తోందన్నారు. తొలి వారం వచ్చిన షేర్ సినిమా బడ్జెట్ కు రెట్టింపని ఆయన చెప్పారు. తొలివారంలోనే రెండింతలు ప్రావిట్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైద్రాబాద్ , విజయవాడ, వైజాగ్ లలో సినిమా తప్పనిసరిగా 100 రోజులు ఆడుతుందనీ, అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ 10 వారాలు ఆడుతుందని అననుకుంటున్నామనీ చెప్పారు. యువతీయువకులతో పాటు పెద్దవాళ్లు కూడా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. 30 ప్రింట్లతో సినిమా విడుదల చేశామనీ, ఎన్నికల పూర్తయిన అనంతరం మరి కొన్ని ప్రింట్లు పెంచాలని అనుకుంటున్నామనీ చెప్పారు. సినిమాలో త్రిష సరసన నటించిన హీరో వెంకట రాఘవన్ మాట్లాడుతూ, ఇందులో తాను సర్దార్ జీగా నటించాననీ, ఇందుకోసం 40 రోజుల పాటు గెడ్డం పెంచాననీ చెప్పారు. గతంలో తాను హైద్రాబాదీ ఫిల్మ్ 'అంగ్రేజ్'లో నటించానని అన్నారు. తన హృదయానికి ఎంతగానో హత్తుకున్న చిత్రం 'ఆకాశమంత' అని, తెలుగు అమ్మాయి సర్దార్ యువకుడితో రొమాన్స్ చేయడం వినూత్నమైన ఐడియా అనీ అన్నారు. ఈ సక్సెస్ మీట్ లో చిత్ర సహ నిర్మాతలు శిరీష్-లక్ష్మణ్ సైతం పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|