పోలీస్ అఫీసర్ గా నమిత
లేడీ పోలీస్ ఆఫీసర్ పేరు చెబితే 'కర్తవ్యం' చిత్రంలో నటించిన విజయశాంతి గుర్తుకు వస్తుంది. ఆమె నటన దాదాపు స్వస్తి చెప్పడంతో ఆ తరహా పాత్రలకు ఇంతవరకూ చేసే సాహసం దాదాపు ఏ హీరోయిన్ చేయలేదు. అయితే ఇప్పుడు 'భవాని ఐపిఎస్' చిత్రంలో స్నేహ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. తాజాగా నమిత సైతం ఖాకీ డ్రెస్ లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నమిత పోలీసు అధికారిణిగా శ్రీదేవి సినీ చిత్ర పతాకంపై 'దేశద్రోహి' అనే చిత్రాన్ని కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో జి.వి.హెచ్ ప్రసాద్ నిర్మించబోతున్నారు.
ఒక పవర్ ఫుల్ పోలీసు కథాంశంతో ఈ చిత్ర కథ ఉంటుందనీ, విజయశాంతితో ఈ కథను తెరకెక్కిద్దామని తొలుత అనుకున్నప్పటికీ చివరకు నమితను ఎంపిక చేసినట్టు నిర్మాత తెలిపారు. ఈ పాత్రకు నమిత చక్కగా సరిపోతుందనీ, ఈ పాత్రకోసం ఇప్పటికే ఆమె 8 కిలోల బరువు తగ్గారనీ వివరించారు. ఈనెల మూడో వారం నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ, నమిత పోలీసు అధికారిణిగా ఇందులో పవర్ ఫుల్ రోల్ పోషించనుందనీ, ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారనీ దర్శకుడు వివరించారు. హైద్రాబాద్, చెన్నై, రాజస్థాన్, ఢిల్లీలో షూటింగ్ షెడ్యుల్స్ ను ప్లాన్ చేశామనీ, జూలై నాటికి సినిమా పూర్తవుతుందనీ తెలిపారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలకు విజయశాంతి చక్కగా సరిపోతారనీ, ఆమెలో పదవ వంతు చేసినా తనకు సంతోషమేననీ నమిత పేర్కొన్నారు. ఓ యువ కథానాయకుడు నటించనున్న ఈ చిత్రంలో రామిరెడ్డి, బ్రహ్మానందం తదతరులు ఇతర పాత్రలు పోషించనున్నారు.
Be first to comment on this News / Article!
|