హీరోగా నారా రోహిత్
మూడు దశాబ్దాలకు పైగా వైజయంతీ మూవీస్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తున్న అగ్రనిర్మాత అశ్వనీదత్ మరో కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. 'రాజకుమారుడు'తో ప్రిన్స్ మహేష్ నూ, 'చిరుత'తో రామ్ చరణ్ తేజను పరిశ్రమకు పరిచయం చేసిన క్రెడిట్ దత్ కు దక్కుతుంది. ఈసారి కూడా ఆయన తన బ్యానర్ ద్వారా ఓ కొత్త హీరోను పరిచయం చేయబోతున్నారు. అయితే గత సందర్భాలకు భిన్నంగా ఈసారి ఒక పొలిటీషియన్ తనయుడిని హీరోగా పరిచయం చేస్తుండటం విశేషం. ఆ హీరో మరెవరో కాదు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారాచంద్రబాబు సోదరుడైన నారా రామమూర్తినాయుడి తనయుడు రోహిత్.
రోహిత్ ను తొలుత డి.రామానాయుడు పరిచయం చేయాలనుకున్నారనీ, అయితే చివరకు ఆ ప్రాజెక్ట్ అశ్వనీదత్ చేతుల్లోకి వచ్చిందనీ సమాచారం. యువతరం మెచ్చే సబ్జెక్ట్ తో ఈ చిత్ర కథ ఉండబోతోంది. ఇటీవల 'కొత్తబంగారులోకం' వంటి హిట్ చిత్రానికి పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో పనిచేయబోతున్నారు. కొత్త హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. యంగ్ టాలెంట్ చైతన్య దంతులూరి
ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈనెల 27న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమవుతుందనీ, అశ్వనీదత్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొంటారనీ తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|