తెగబడిన పోసాని,రాజశేఖర్!
సినీ నటులు స్వల్వ ప్రయోజనాలు ఆశించి రాజకీయాల్లోకి అడుగుపెడుతూ పరిశ్రమ ప్రతిష్ఠను బుగ్గిపాలు చేస్తున్నారంటూ తమ్మారెడ్డి భరద్వాజ వంటి సీనియర్ ప్రముఖులు ఓవైపు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. ఇవాళ తిట్టుకుంటూ రోడ్డెక్కుతున్న వీళ్లే మళ్లీ రేపు కలిసి పనిచేయాల్సి ఉంటుందనీ, అప్పుడు ముఖముఖాలు చూపుకోలేని పరిస్థితి ఏర్పడుతుందనీ, ఇది పరిశ్రమకు కూడా చెడ్డపేరు తెస్తుందనీ వారంటున్నారు. ఊహించినట్టే...ఇప్పుడు పోసాని, జీవితా రాజశేఖర్ దంపతుల మధ్య వాగ్యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటూ వ్యక్తిగత జీవితాలపైనా బురద చల్లుకునేంత వరకూ వెళ్లింది. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోసాని పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరఫున జీవిత-రాజశేఖర్ దంపతులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభివృద్ధి పథకాలపై రాజశేఖర్ దంపతులు ప్రచారం చేస్తున్నా, ఈ ఇద్దరి ప్రధాన ప్రత్యర్థి పి.ఆర్.పి., ఆ పార్టీ అధినేత చిరంజీవి అనే విషయం సుస్పష్టమవుతూనే ఉంది. చిరంజీవిని టార్గెట్ చేసుకుంటున్న రాజశేఖర్ దంపతులపై పోసాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండగా, ఆయనో 'పిచ్చికుక్క' అనీ, ఆయన మాటల్ని ఖాతరు చేయాల్సింది లేదనీ జీవిత, రాజశేఖర్ తేలిగ్గా కొట్టిపారేశారు.
ఇప్పుడు వారి మాటల యుద్ధం తారాస్థాయికి కూడా చేరుకుంటోంది. 'మీరే పిచ్చికుక్కలు. రోడొక్కిన ఈ పిచ్చికుక్కల్ని తరమి కొట్టండి' అంటూ పోసాని రిటార్డ్ ఇచ్చారు. రాజశేఖర్ దంపతుల కుటుంబ వ్యవహారాలనూ ఆయన దుయ్యపట్టడం మొదలుపెట్టారు. దీనికి రాజశేఖర్ దంపతులకు తిక్కరేగి 'పోసాని ఎంత మెంటలోడో అందరికీ తెలుసు. ఆయన ప్రవర్తనకు మెంటల్ కృష్ణ సినిమా అద్దంపడుతుంది. టైటిల్ ఆయనకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ఆయనకు బుర్రలేదు. పిఆర్ పిలో నిజమైన మెంటల్ కృష్ణ ఆయనే. ఆయనకు ఎన్నికల్లో పోటీచేసేందుకు టిక్కెట్ ఎలా ఇచ్చారో అర్ధం కాదు. మా మీద ఫూలిష్ ప్రకటనలు ఇవ్వగల కెపాసిటీ ఉండటం వల్లనే బహుశా ఆయనకు టిక్కెట్లు ఇచ్చి ఉంటారు. ఆయనేం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. ఆయన భాష, బాడీ లాంగ్వేజ్ ను బట్టే ఆయనో మెంటల్ కేసని ఈజీగా అర్ధమవుతుంది. ఎవరికైనా ఒకవేళ అనుమానాలు ఉంటే అతనెలాంటి వాడో అతని భార్యను అడగండి' అంటి రాజశేఖర్ దంపతులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలా మాటల యుద్ధం పెరగిపోయి...సంసారంలోని గుట్టుమట్లు కూడా బయటపడుతుండటం చూసి జనం విస్తుపోతున్నారు. ఈ విషయం గ్రహిస్తే ఇరు పక్షాలకూ మంచిదే మరి.
Be first to comment on this News / Article!
|